అక్ష‌రాల గుడిలో..

-భువ‌న‌మ్మ ఒడిలో..
– చల్లపల్లి ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూలులో భావోద్వేగాలు

– 400 మందికి పైగా అనాథ‌లు, పేద‌పిల్ల‌ల‌ను చ‌దివిస్తోన్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మేనేజింగ్ ట్ర‌స్టీ భువ‌నేశ్వ‌రి
– పిల్ల‌ల‌తో భోజ‌నం చేసి, యోగ‌క్షేమాలు తెలుసుకున్న భువ‌న‌మ్మ

పేద‌పిల్ల‌ల‌కు అదో అక్ష‌రాల గుడి.. త‌ల్లిదండ్రుల్లేని అనాథ‌ల‌కు ఆద‌రించే అమ్మ ఒడి.. అదే చ‌ల్ల‌ప‌ల్లిలోని ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్‌. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అనాథలు, పేద పిల్ల‌ల‌కు ఉచితంగా నాణ్య‌మైన విద్య‌, వ‌స‌తి క‌ల్పించే అక్ష‌రాల‌యం ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్. సుమారు 400 మందికి పైగా విద్యార్థులకు అమ్మానాన్న అన్నీ అయి చ‌దివిస్తోంది భువ‌న‌మ్మ‌. చాలా రోజుల త‌రువాత పిల్ల‌ల మ‌ధ్య మ‌హాత‌ల్లి భువ‌న‌మ్మ ఆనందంగా గ‌డిపారు.

మ‌హానాయ‌కుడు ఎన్టీఆర్ కుమార్తెగా, దార్శ‌నికుడు చంద్ర‌బాబు స‌తీమ‌ణిగా, యువ‌గ‌ళం నారా లోకేష్ మాతృమూర్తిగా మ‌నందరికీ ప‌రిచ‌యం నారా భువ‌నేశ్వ‌రి. ఆంత్ర‌ప్రెన్యూర్‌గా హెరిటేజ్‌ని విజ‌య‌ప‌థంలో న‌డిపారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మేనేజింగ్ ట్ర‌స్టీగా సేవాస్ఫూర్తిని చాటారు. విద్య‌,వైద్య రంగాల్లో.. పేద పిల్ల‌ల‌కు సాయం అందించ‌డంలో భువ‌నేశ్వ‌రి సాటిలేని మేటి. ప్ర‌కృతి విపత్తుల స‌మ‌యంలో బాధితుల్ని ఆదుకోవ‌డంలో ముందుండేలా ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ని నిలిపారు. బ్ల‌డ్ బ్లాంక్, ఎన్టీఆర్ స్కూల్స్ ద్వారా సేవాప్ర‌స్థానం అప్ర‌తిహ‌తంగా కొన‌సాగిస్తున్నారు.

తండ్రి సీఎంగా ఉన్నా, భ‌ర్త సీఎంగా ఉన్నా..కొడుకు మంత్రిగా ఉన్నా ఏనాడూ రాజ‌కీయాల్లో క‌నిపించ‌ని భువ‌నేశ్వ‌రి…త‌న భ‌ర్త అక్ర‌మ అరెస్టుని నిర‌సిస్తూ, నిజం గెల‌వాలి అంటూ రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించారు. అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ కూట‌మి త‌ర‌ఫున విస్తృత ప్ర‌చారం చేశారు. ఈ బిజీ షెడ్యూల్ వ‌ల్ల ఎన్టీఆర్ స్కూలుని సంద‌ర్శించ‌లేక‌పోయారు. పిల్ల‌ల్ని చూడాల‌నే ఆరాటంతో శుక్ర‌వారం చ‌ల్ల‌ప‌ల్లి ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూలుని భువ‌న‌మ్మ సంద‌ర్శించారు. ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు.

పిల్ల‌లంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ హ‌త్తుకున్నారు. సౌక‌ర్యాలు ఎలా ఉన్నాయ‌ని ఆరా తీశారు. అమ్మ ఒడిని చేరిన పిల్ల‌ల తీరుగా అంద‌రూ భువ‌న‌మ్మ‌ని చుట్టుముట్టారు. అల్లుకుపోయారు. వారితోనే భోజ‌నం చేశారు. చ‌క్క‌గా చ‌దువుకుని ఎన్టీఆర్ స్కూలు విద్యార్థులమ‌ని గ‌ర్వంగా చాటిచెప్పాల‌ని ఉద్బోధించారు. చాలా రోజుల త‌రువాత హాయిగా, న‌వ్వుతూ పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేసి.. అప‌రిమిత ఆనందంతో పిల్ల‌ల‌కు వీడ్కోలు ప‌లికారు భువ‌న‌మ్మ‌. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ సీ.ఓ.ఓ గోపి అడుసుపల్లి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.