– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, మహానాడు: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ , స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, ఆకట్టుకునే రీతిలో శకతాల ప్రదర్శన కొనసాగింది.
అనంతరం, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ శాఖలు ఏర్పాటుచేసిన ప్రదర్శన శకటాలను తిలకించారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు రెండువందల యాభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలచెక్ ను అందించారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకొని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి, కలెక్టర్ , ప్రత్యేకంగా అభినందిస్తూ, బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు , జిల్లా ఎస్పి రూపేష్, అదనపుక ల్లెక్టర్ లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, సంగారెడ్డి మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మి అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.