Mahanaadu-Logo-PNG-Large

ప్రజా సమస్యల పరిష్కారంపై పరిటాల సునీత వినూత్న కార్యక్రమం

-ప్రతి రోజు ఒక్కో మండలంలో గ్రీవెన్స్
-తొలిరోజు చెన్నేకొత్తపల్లి గ్రీవెన్స్ లో పెద్ద ఎత్తున సమస్యలు
-భూములు, రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలే అధికం
-తాగునీరు, విద్యుత్ సమస్యలపై వినతులు
-కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిన సునీత
-మరికొన్నింటిని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశం

వెంకటాపురం: నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచిన పరిటాల సునీత.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు సమస్యలు చెప్పుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వెంకటాపురం లేదా అనంతపురం తరలివస్తున్నారు. ఇది ప్రజలకు ఒకింత భారంగా మారింది. అందుకే ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సునీత భావించారు.

ఇందులో భాగంగా తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరితో నేరుగా సునీత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓపికగా వారి సమస్యలు విన్నారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తమ భూములను వైసీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

ఎన్నో ఏళ్ల నుంచి తాము సాగులో ఉన్నప్పటికీ.. ఆన్ లైన్ లో నుంచి తొలగించి వైసీపీ నాయకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. తమ భూములు తమకు దక్కేలా చూడాలని విన్నవించారు. పింఛన్లు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ తమకు ఇవ్వడంలేదని కొందరు.. గతంలో వచ్చే పింఛన్లను తొలగించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి.

వీటిపై కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని పలువురు వినతులు అందజేశారు. చెన్నేకొత్తపల్లి గ్రామంలో పశువుల సంత ఏర్పాటు చేయాలని.. బీసీ కాలనీలో ఆలయ నిర్మాణం, స్థానిక ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, వైద్యులను నియమించాలని ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. తాగునీటి సమస్య, నూతన గృహాలు మంజూరు తదితర సమస్యలు ఎక్కువగా కనిపించాయి.

వీటిలో కొన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. మరికొన్నింటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. బడ్జెట్ కు సంబంధించిన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు చేపడుతామని సునీత అన్నారు.

ఇక నుంచి ప్రతి మండలంలోనూ గ్రీవెన్స్ నిర్వహిస్తామని.. ప్రజలు వారి మండలానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. మంగళవారం రోజు కనగానపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నారు.