అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో అవమానాలు

– ఆహుతులకు కుళ్ళిన తిను బండారాలు పంపిణీ చేసిన అధికారులు

గుడివాడ, మహానాడు: గుడివాడ అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో కుళ్లిన తిను బండారాలు, ఆహారం సరఫరా చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ కార్యక్రమానికి అధికారుల నుండి ఆహ్వానాలు అందాయి. అయితే, అక్కడకు వెళ్ళిన ఆహుతులకు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి.

ఇది అధికారుల వైఫల్యమా, నిర్లక్ష్యమా అన్న దానిపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కడియాల స్వీట్స్ అండ్‌ బేకర్స్ కు సంబంధించి ఫుడ్ బాక్సులు (ఫుడ్ బాక్స్ లో ఒక కేక్ రోల్, ఒక చిన్న సమోసా, ఒక బిస్కెట్, టిష్యూ పేపర్) అధికారులు స్నాక్స్ గా పంపిణీ చేశారు. ఈ ఫుడ్ బాక్సుల్లో ఫంగస్ ఏర్పడిన కేక్ రోల్స్ సరఫరా చేయడం అవమానానికి దారి తీసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ ఫుడ్ బాక్సులు అందించారు. ఇందులో ఎంతమంది ఈ ఫంగస్ కేక్ రోల్స్ అందుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది.