ఇంతింతై..వటుడిరతై..నాలుగోసారి అంత ఎత్తయి…

చంద్రబాబు సుదీర్ఘ ప్రస్థానంలో విజయాలు
1975 యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ప్రవేశం
1978లో తొలిసారి చంద్రగిరి నుంచి గెలుపు
1995లో మొదటిసారి ఎన్టీఆర్‌ నుంచి పగ్గాలు
జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలక పాత్ర
హైటెక్‌ సిటీ నిర్మాణంతో ప్రపంచస్థాయి గుర్తింపు
ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రను పాలించిన ఏకైక సీఎం
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

అమరావతి: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు చిన్నతనం నుంచే గ్రామీణ ప్రాంత పేదల ఇబ్బందులు కళ్లారా చూశారు. చదువుకునే రోజుల్లోనే 1975లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 1978లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1980లో సీఎం టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. 1983లో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. 1986లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా.. 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఎన్టీఆర్‌ నుంచి టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత 1995 సెప్టెంబర్‌ 1న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 1998లో హైదరాబాద్‌ లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైటెక్‌ సిటీ ప్రారంభించారు. 1996 యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్నారు. 1999లో జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 1999లోనే రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం సీఎంగా సేవలందించిన నాయకుడి గా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఏపీలో 2004-2014 వరకూ పదేళ్లు ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో అమరావతిని రాజధానిగా చేసి పాలన సాగించారు. రాజధాని అభివృద్ధి కోసం కృషి చేశారు. 2019 నుంచి ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2024లో నవ్యాంధ్రకు రెండోసారి.. మొత్తంగా నాలుగోసారి సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు.