– సీఎంకు, లోకేష్ కు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి లేఖ
మాచర్ల, మహానాడు: నా మీద ఓ దినపత్రికలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి నేను దోషిగా తెలిస్తే చర్యలు తీసుకోవాలంటూ మాచర్ల శాసన సభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ పెద్దలకు లేఖ రాసినట్టు తెలిపారు. శనివారం మాచర్ల పట్టణంలో మాట్లాడుతూ పరిపాలన అనుమతులు లేని పనులలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయటం ఎంతో బాధించిందని అన్నారు. నియోజకవర్గంలోని మేజర్ కాలువలు గడచిన అయిదేళ్ళలో మరమ్మతు చేయకపోవడంతో అడవులను తలపించాయని తద్వారా చివరి భూములకు సాగునీరు అందకపోవటంతో మేజర్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సొంత ఖర్చుతో పనులు చేస్తుంటే అవినీతి జరిగిందంటూ నిరాధార ఆరోపణ చేయటం రికార్డు అన్నారు.
క్షేత్రస్థాయిలో విలేకరులు మేజర్ కాలువలను పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియచేస్తే వాటిని సరి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రానైట్ లారీ ఒక్కటైన మాచర్ల నుండి తరలిపోయిందా అని ప్రశ్నించారు. నెలకు రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ తాను ఆ ఆఫర్ ను తోసి పుచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు నియోజకవర్గంలో ఏ లిక్కర్ షాపులోనైనా భాగం ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే మాచర్ల నియోజకవర్గం ప్రజలను బానిస సంకెళ్ల నుండి విముక్తి చేస్తామని చెప్పానని అదేవిధంగా ప్రజలను స్వేచ్ఛాయుతంగా తమ జీవించే విధంగా చూస్తున్నామన్నారు.