Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

– రూ. 36 వేల కోట్ల రికార్డు
– అమెరికాలో రూ.31502 కోట్లు
– దక్షిణ కొరియాలో రూ.4500 కోట్లు
– 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు
– విజయవంతమైన సీఎం విదేశీ పర్యటన
– ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు

హైదరాబాద్‌, మహానాడు: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ముఖ్యమంత్రి జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులకు లైన్​ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో మరో రూ.36 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.76,232 కోట్ల మేర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవటం సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రధానంగా అటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజీ, టెక్స్ టైల్ రంగాలపై దృష్టి సారించింది. వీటిలో ప్రపంచంలో దక్షిణ కొరియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు చర్చలు, సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించి, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకోచ్చే కంపెనీలకు ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో అమెరికన్ కంపెనీల తరహాలోనే కొరియన్ కంపెనీల నుంచి భారీ స్పందన లభించింది.

హ్యుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసి గ్లోబల్ హబ్‌గా ఎంచుకుంటామని ప్రకటించింది. కంపెనీ కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో అందుబాటులో ఉంటుందని అన్నారు.

వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో వస్త్ర తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న యంగ్‌వన్ కంపెనీ హైదరాబాద్‌లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందుకు అవసరమయ్యే 10 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్ట్ కు సమీపంలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున సమ్మతించే లేఖను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి యంగ్‌వన్​ చైర్మన్‌కు అందించారు..

కాస్మెటిక్ ఇండస్ట్రీలో దక్షిణ కొరియా ప్రత్యేక స్థానముంది. ఆ రంగంలో పేరొందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాస్మెటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పరస్పర సహకారం కోరారు.

తెలంగాణలో వీటి తయారీకి ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలు అన్వేషించాలని కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ (కోబిటా)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఇదే సందర్భంగా మరో మూడు కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను ప్రకటించాయి. డాంగ్‌బాంగ్ ఫార్మా కంపెనీ రూ. 200 కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. జేఐ టెక్ కంపెనీ ఎల్ఈడీ మెటీరియల్ తయారీ ప్లాంట్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ. 100 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. చావి కంపెనీ హైదరాబాద్‌లో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాని తయారు చేయనున్నట్టు ప్రకటించింది.

ఎల్ ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శామ్సంగ్ సీ అండ్ టీ, శామ్సంగ్ హెల్త్ కేర్, క్రాఫ్టన్, యూయూ ఫార్మా, జీఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులకు అనువైన గమ్య స్థానంగా ఎంచుకోవాలని ఆహ్వానించారు.

పర్యటనలో భాగంగా కొరియాలోని చెంగియీచియోన్ స్ట్రీమ్ రీడెవలప్‌మెంట్, హాన్ రివర్‌ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. అక్కడ అనుసరించిన కొన్ని అద్భుతమైన నమూనాలను ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ ప్రాజెక్టుకు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ ప్రాజెక్టుల అభివృద్ధికి అనుసరించిన విధానాలు, వాటిని నిర్వహిస్తున్న తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఇటీవలి ఒలింపిక్స్​ విజేతలెందరినో ఈ యూనివర్సిటీ తీర్చిదిద్దింది. మన రాష్ట్రంలోనూ అదే తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.