– వెయిటింగ్‌లో 1ం మంది ఐఏఎస్‌లు
– వెయిటింగ్‌లో శ్రీలక్ష్మి, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరిత
– తాజాగా హరితకు పోస్టింగ్ ఇచ్చి రద్దు చేసిన వైనం
– మరి వారిని సీఎస్ హాజరుకావాలని మెమో ఇవ్వరా?
– ఐఏఎస్‌ల ఐకమత్యమే సీఎస్ మౌనానికి కారణమా?
– జగన్‌తో టచ్‌లో ఉన్నందుకే ఆ ఐపిఎస్‌లకు పిలుపు?
– అందులో నలుగురు వైసీపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారన్న సమాచారం?
– వీరిలో పలువురు ఎస్పీ, డీఎస్పీలతో టచ్‌లో ఉన్నారన్న అనుమానం
– కేసుల విచారణను ప్రభావితం చేస్తున్నారన్న ఫిర్యాదులు?
– నిఘా నివేదికలతోనే 16 మంది ఐపిఎస్‌లకు హెడ్‌క్వార్టర్సుకు పిలుపు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకరు ఐఏఎస్.. మరొకరు ఐపిఎస్. ఇద్దరికీ బాసులు వేరయినా సర్వీసు నిబంధనలు ఒక్కటే. మరి వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్‌లను రోజూ ఆఫీసుకు రావాలని పోలీసు బాసు ఆదే శిస్తే.. అదే పని ఐఏఎస్‌ల బాసు ఎందుకు ఇవ్వరు? ఎందుకు వారిపై ప్రేమ? ఐపిఎస్‌లలో ఉన్న అనైక్యత.. ఐఏఎస్‌లలో ఉన్న ఐక్యత దానికి కారణమా? అంటే మనం మనం బరంపురమా? ఇదీ ఇప్పుడు రాజకీయ-అధికార వర్గాల్లో హాట్ టాపిక్.
జగన్ సర్కారుతో అంటకాగిన 16 మంది ఐపిఎస్ అధికారులను ప్రతిరోజూ హెడ్‌క్వార్స్‌కు హాజర వాలన్న డీజీపీ నిర్ణయాన్ని.. ఐఏఎస్‌ల విషయంలో సీఎస్ ఎందుకు పాటించరన్న ప్రశ్నలు కూటమి వర్గాల్లో తెరపైకి వస్తున్నాయి. జగన్ జమానాలో ఒక వెలుగువెలిగి, ఇప్పుడు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లు సెలవులు ఎంజాయ్ చేస్తుంటే, వారిని కూడా డీజీపీ మాదిరిగానే సీఎస్ ఎందుకు పిలవన్న చర్చ అటు అధికార వర్గాల్లోనూ వినిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం మారి, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరితకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. అయితే ప్రవీణ్ ప్రకాష్ వీఆర్‌ఎస్ ఇచ్చారు. మిగిలిన వారంతా జీఏడీకి రిపోర్టు చేసి, సెలవులను ఎంజాయ్ చేస్తున్నారన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వీరిలో నలుగురు అధికారులు జగన్, వైసీపీ అగ్రనేతలతో రోజూ టచ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యలు అటు టీడీపీ వర్గాల్లోనూ వినిపిస్తుండటం విశేషం. వీరిలో ఒక సీనియర్ అధికారి, పార్టీ నేతలు ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించి డ్రాఫ్టింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా హరితకు జేసీగా పోస్టింగ్ ఇచ్చిన సర్కారు, వెంటనే దానిని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వు ఇచ్చింది. వీరిలో చాలామంది విజయవాడలో ఉండటం లేదని, కొందరు హైదరాబాద్, మరికొందరు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. మరి వీరందరినీ సీఎస్ ప్రతిరోజూ సచివాలయానికి హాజరుకావాలని ఎందుకు మెమో ఇవ్వరన్న చర్చ జరుగుతోంది.
‘సహజంగా ఐపిఎస్‌లలో అనైక్యత ఉంటుంది. అందుకే వారికి వెంటనే పోస్టింగులు రావు. కానీ ఐఏఎస్‌లలో మాత్రం అది ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి. ఎవరూ ఎక్కువకాలం వెయిటింగ్‌లో ఉండరు. ఇక ఆ అధికారులు నార్త్ వాళ్లయితే చెప్పేపనిలేదు. వీరంతా సీఎం-సీఎస్‌లు ఎవరున్నా ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇప్పించుకుంటారు. బహుశా ఈ ప్రేమ వల్లనేమో సీఎస్ ఆ 10 మందిని రోజూ సచివాలయానికి వచ్చి హాజరువేయించుకోవాలని ఆదేశించలేకపోతున్నార’ని ఓ ఐపిఎస్ అధికారి విశ్లేషించారు.
జగన్ జమానాలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్పించారన్న ఆగ్రహంతో.. ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్రకు చాలాకాలం పోస్టింగులివ్వలేదు. కానీ విచిత్రంగా ఐఏఎస్ సతీష్‌చంద్రకు పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం, ఐపిఎస్ అయిన ఏబీకి ఇవ్వలేదని గుర్తు చేశారు.
ఇదిలాఉండగా.. డీజీపీ మెమో అందుకున్న ఆ 16 మంది ఐపిఎస్‌లలో, పలువురు అధికారులు ఇప్పటికీ జగన్ సహా పార్టీ కీలకనేతలతో టచ్‌లో ఉన్నారన్న సమాచారం నిఘా అధికారులకు ఉందంటున్నారు. అందులో గత ఎన్నికల ముందు క్రియాశీలపాత్ర పోషించి, ఎస్పీ-డీఎస్పీలకు వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని ఆదేశించిన నలుగురు ఐపిఎస్‌లు వైసీపీతో ఇంకా అంటకాగుతున్నారన్న ఫిర్యాదులున్నట్లు తేలింది.
అందులో ఒక అధికారి సలహా మేరకే.. ఇటీవల విజయవాడలో అంబేద్కర్ ఘటనను వివాదం చేశారంటున్నారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డితో వీరిలో కొందరు రోజూ ఫోన్లలో మాట్లాడుతుండగా, మరికొందరు హైదరాబాద్‌లో నేరుగా భేటీ అవుతున్నట్లు నిఘా వర్గాలకు ఉప్పందినట్లు చెబుతున్నారు. అందుకే వారిని అసాధారణ రీతిలో హెడ్‌క్వార్టర్స్‌కు రావాలన్న ఆదేశాలిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఇద్దరు ఐపిఎస్ అధికారులు.. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలపై నమోదయిన కేసులను పర్యవేక్షిస్తుండగా, తమపై విచారణకు వచ్చే కేసులను ఊహించి.. తమ వద్ద గతంలో పనిచేసిన పోలీసు అధికారులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.