– డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్‌గా జీవీరెడ్డి?
– మరికొన్ని నియామకాలు ఖరారు
-నేడు ప్రకటించే అవకాశం?
-శ్రావణ శుక్రవారం రోజున తమ్ముళ్లకు బాబు శుభవార్త
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి సర్కారు గద్దెనెక్కిన తర్వాత తొలివిడత పదవుల పండగకు రంగం సిద్ధమయింది. శ్రావణ శుక్రవారం శుభదినం కావడంతో, నామినేటెడ్ పదవుల పంపిణీకి తెరలే చింది. అందులో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని టీవీ5 చానెల్ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇక డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు దాదాపు డజను కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ఖరారు చేశారని, శుక్రవారం దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువడవచ్చంటున్నారు.
కాగా కమ్మ సామాజికవర్గానికి చెందిన బీఆర్ నాయుడుకు, టీటీడీ చైర్మన్ పదవి లభిస్తుందని కూటమి గెలిచిన తొలిరోజు నుంచే చర్చ జరుగుతోంది. ఆ మేరకు ఆయనకు చంద్రబాబు ఎన్నికల ముందే హామీ ఇచ్చారని, నాయుడు సన్నిహిత వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. అయితే కమ్మ సామాజికవర్గానికి చెందిన వెంకయ్యచౌదిరిని టీటీడీ అడిషనల్ ఈఓగా నియమించినందున, మళ్లీ అదే కులానికి చెందిన బీఆర్ నాయుడును నియమించేందుకు చంద్రబాబు సాహసిస్తారా? పార్టీపై కులముద్ర పడేందుకు బాబు అంగీకరిస్తారా? అన్న చర్చ జరిగింది.
సహజంగా కులం లెక్కలు జాగ్రత్తగా చూసే చంద్రబాబు, పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. మిగిలిన కులాల్లో అసంతృప్తి కలగకుండా, తనపై కులముద్ర పడకుండా వ్యవహరిస్తారన్న పేరుంది. అందుకే టీటీడీ చైర్మన్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. కానీ గతంలో మాదిరి విమర్శలకు భయపడకుండా, జగన్ మాదిరి ఈసారి ధైర్యంగానే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి ఈ పదవిని, సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ ఆశించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. అయితే ఆయన వర్గీయుడైన దమ్మాలపాటికి, ఈపాటికే అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చినందున, ఇక ఆయనకు అవకాశం ఉండకపోవచ్చన్న చర్చ కూడా జరిగింది. పైగా సీజే చేసిన ఆయన స్థాయికి టీటీడీ చైర్మన్ చిన్న పదవి అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
ఇక క్షత్రియ వర్గానికి చెందిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, బీసీ యాదవ వర్గానికి చెందిన బీద రవిచంద్ర పేరు కూడా టీటీడీ చైర్మన్ పదవికి చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఏడుగురు క్షత్రియ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ, వారికి మంత్రివర్గంలో స్థానం లభించని నేపథ్యంలో, రఘురామకృష్ణంరాజుకు ఆ పదవి ఇచ్చి ఆ వర్గాన్ని సంతృప్తిపరుస్తారన్న చర్చ జరిగింది. అయితే టీటీడీ చైర్మన్ పదవిని కమ్మ వర్గానికి చెంనిన బీఆర్ నాయుడుకు ఖరారు చేయడంతో.. ఇక రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఏపీ ప్రతినిధి ఆశలు సజీవంగా ఉన్నట్లే.
ఎందుకంటే.. టీటీడీ చైర్మన్ పదవి కమ్మ వర్గానికి ఇచ్చినందున.. ఢిల్లీలో ఏపీ ప్రతినిధి పదవి కూడా, మళ్లీ అదే వర్గానికి ఇచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు. అయితే మారిన బాబు వైఖరిని బట్టి, ఆ వాదన తప్పనిపించకమానదు. ఢిల్లీలో ఆపదవికి కమ్మ వర్గానికి చెందిన సుజనాచౌదరి, గల్లా జయదేవ్, కనమేడల రవీందర్, కంభంపాటి రామ్మోహన్‌రావు పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.