-రైతుల కళ్లలో ఆనందాన్ని చూడలేక విమర్శలు
-బీఆర్ఎస్ గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ!
-హరీష్ రావు పై మండిపడ్డ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణ మాఫీతో రైతుల కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. ఆ ఆనందాన్ని చూడలేకే హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దుయ్యబట్టారు. తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన పాపం ఎవరిదో అందరికి తెలుసు. కాళేశ్వరానికి మరమ్మత్తులు చేయలేదని హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. లక్షన్నర కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము ను గోదారి పాలు చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావు దేనని మండిపడ్డారు. కాళేశ్వరం స్కామ్ నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కు తున్నారన్నారు.
మెదడు తలలో ఉందా మోకాళ్లలో ఉందా?
అక్టోబర్ 23న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది. కుంగిన ప్రాజెక్టు గురించి హరీష్ రావు, కేటీఆర్ ఏనాడు మాట్లాడలేదు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి హరీష్ రావు చవకబారు విమర్శలు చేస్తున్నారు. ప్రజాపాలన చూసి ఓర్వలేకనే ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అధికారంలో ఉన్నానని విర్రవీగుతూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆరడుగుల హరీష్ రావు మెదడు తలలో ఉందా మోకాళ్లలో ఉందా? అని ఎద్దేవా చేశారు.
గోదావరిలో పై నుంచి భారీ ఎత్తున వరద వస్తుంటే మేడిగడ్డలో నిల్వ చేసే పరిస్థితి లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు మేడిగడ్డలో నిల్వ చేయొద్దని హెచ్చరించారు. అన్నారం డ్యామ్ లో కూడా నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. వారం రోజుల్లో 73 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. గేట్లన్ని ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదలాల్సి వస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన పాపాలను మా ప్రభుత్వం కడిగేస్తుంది.
మేడిగడ్డను ఏ రకంగా పునరుద్దరించాలన్న దానిపై ప్రభుత్వం ఢిల్లీలో సంప్రదింపులు చేస్తోంది. అనుభవజ్ఝుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకే దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది. రెండో దఫా మరో ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నారు.
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎవరు రైతులను నట్టేట ముంచారో అన్ని విషయాలు బయటకు తీస్తాం. తెలంగాణలో రైతులను రాజుగా చేస్తున్నం. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా హరీష్ రావు వక్ర బుద్ధి మారడం లేదు. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు.
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ
లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తిరస్కరించారో బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ చేస్తోంది. ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్ఎస్ నేతలే. సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. రాజ్ భవన్ కి పోయే అర్హత కేటీఆర్ కు లేదు. గవర్నర్ ను గౌరవించుకునే సంప్రదాయం బీఆర్ఎస్ కు లేదు.
రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నారు. ప్రతిపక్ష బాధ్యతను కూడా బీఆర్ఎస్ నిర్వహించలేక పోతుంది. కేసీఆర్ అసమర్థత వల్లే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. అసెంబ్లీ తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. తెలంగాణతో బీఆర్ఎస్ పేగు బంధాన్ని తెంపుకుందని విమర్శించారు.
చవటలు, దద్దమ్మలు అని తెలంగాణ భాష పేరుతో మాట్లాడింది కేసీఆర్ కాదా. హరీష్ రావు రోజుకో సమస్య పేరుతో హడావిడి చేస్తున్నడు. ప్రభుత్వంపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాని ఆ బురద పడేది ఆయనపైనే. అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన సాహసోపేతమైన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ వైపు ఉన్నారని కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు.
గత ప్రభుత్వం స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించింది. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులను అప్పులపాలు చేశారు. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలను విడుదల చేస్తున్నాం. హరీష్ రావు ఎన్ని చేసినా కేసీఆర్ నమ్మడు. రేపో మాపో హరీష్ రావు బీజేపీలోకి వెళ్లడం ఖాయం. కేసీఆర్ అసెంబ్లీ కి రావాలని కోరుకుంటున్నం… ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తామని అయిలయ్య అన్నారు.