కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుందన్నది వాస్తవం

– ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి అసత్యాలు
– మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయి
– కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడి దారుల్లో అయోమయం
– ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్

తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థ కు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్ గుజరాత్ కు తరలిపోతుందన్నది నిజమని కేటీఆర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి నేను ట్వీట్ చేసిన తర్వాత గౌరవ మంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేన్స్ సంస్థ తెలంగాణలోనే ఉంటుందన్నట్లుగా ప్రకటన చేశారని మండిపడ్డారు.

నిజానికి కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి వారికి అన్ని అనుమతులను ఇచ్చామని చెప్పారు. సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఒకటి కాగా అత్యంత ఆధునాతమైన (OSAT) కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సి ఉంది. మరొకటి PCB యూనిట్ ను వరంగల్ లో ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీని ఒప్పించామని చెప్పారు.

వీటిలో కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సిన (OSAT) గుజరాత్ కు తరలిపోయిందని, ఇక వరంగల్ లో ఏర్పాటు చేయాల్సిన PCB యూనిట్ పై స్పష్టత లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం కేన్స్ సంస్థ సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మాత్రమే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయనుందన్నారు.

వాస్తవానికి (OSAT) ను కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేసి ఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్ లో మంచి భవిష్యత్ ఉండేదన్నారు. కీలకమైన (OSAT), PCB యూనిట్లు తరలిపోతున్నప్పటికీ ఏమీ జరగలేదన్నట్లుగా మంత్రి గారు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాల కారణంగా రెండు పెద్ద ప్రాజెక్ట్ లను కోల్పోవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడి దారులు అయోమయానికి గురవుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

అతి సాధారణమైన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ పేరు చెప్పి కేన్స్ సంస్థ ఎటు తరలిపోలేదంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కచ్చితంగా ప్రజలను మోసం చేయటమేనని మండిపడ్డారు. ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజల ముందు నిజాలను వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.