అన్న క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు
అన్న క్యాంటీన్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ
పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 11వ డివిజన్ పటమట రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభ ఏర్పాట్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ కలిసి పరిశీలించారు. రేపు శుక్రవారం ఉదయం నుంచి అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారని చెప్పారు. పేదలకు అన్నం పెట్టి కడుపు నింపే మంచి కార్యక్రమాన్ని వైఎస్. జగన్మోహన్రెడ్డి పేదలపై కక్ష్య సాధింపుతో రద్దు చేశారని చెప్పారు.
ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదలకు కేవలం రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇస్తారని చెప్పారు. పేదలు, ఇంట్లో భోజనం వండుకోలేని వారికి ఈ అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అక్షయ పాత్ర సంస్థ వారు కేవలం సర్వీస్ ఛార్జీ తీసుకుని ఉచితంగా భోజనం పెడుతున్నారని చెప్పారు.
ఒకొక్క అన్న క్యాంటీన్ ద్వారా రోజుకు 1500 మంది ఆకలి తీరుతుందన్నారు. కేవలం సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందుదామని చూసిన జగన్కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర్య దినోత్సవ వేడుకల్లో పిల్లల కేరింతల మధ్య ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడుని చూస్తే చాలా ముచ్చటగా ఉందన్నారు.
కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ రాష్ట్రానికి ఈ రోజు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి స్వాతంత్ర్యం లేదన్నారు. రాష్ట్రాన్ని రక్షించే నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు వచ్చాడన్నారు. పేదలు ఎక్కువుగా ఉండే తూర్పు నియోజకవర్గ పరిధిలో నాలుగు అన్న క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, అయినా చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమ పథకాలు అపకుండా ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళు తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోనేరు రాజేష్, చెన్నుపాటి గాంధీ, పామర్తి కిషోర్, జాస్తి సురేష్, కాటూరి సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.