టీటీడీలో కల్తీ నెయ్యి వాడినట్లు నిరూపించాలి

– దమ్ముంటే థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ చేయించాలి
– విచారణకు కేంద్రం, సుప్రీంకోర్డు, హైకోర్టుకు లేఖలు రాయాలి
– పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించారు
– మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సవాల్‌

విశాఖపట్నం: టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న సీఎం చంద్రబాబు, తన ఆరోపణలు నిరూపించాలని, ఈ విషయంలో ఆయనకు దమ్ముంటే థర్డ్‌ పార్టీ విచారణ చేయించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

నిజంగా చంద్రబాబు వద్ద ఆధారాలు ఉంటే.. తాను చేసిన ఆరోపణలపై విచారణకు కేంద్రం, సుప్రీంకోర్డు, హైకోర్టుకు లేఖలు రాయాలన్న ఆయన, అందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

జగన్‌ తిరుపతి పర్యటనపై అనవసర రాద్దాంతం చేసిన ప్రభుత్వం, ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ కొత్తగా రాజకీయం మొదలు పెట్టిందని ఆక్షేపించారు.తిరుపతిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే, జగన్‌ తన పర్యటన వాయిదా వేసుకున్నారని మండలి విపక్షనేత చెప్పారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అందుకే 4 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించిన ఆయన, దీనికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. అసలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన కోరారు.

ర్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయని.. బియ్యం, పుప్పు, నూనెలు, కాయగూరల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉల్లి కిలో ధర దాదాపు రూ.70 పలుకుతోందని చెప్పారు. నూనెల ధరలు సలసలా కాగుతున్నాయని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లోనే ఏకంగా రూ.25 వేల కోట్ల అప్పులు చేశారన్న ఆయన, వాటితో ఏమేం చేశారని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదని, అలాంటప్పుడు ఎందుకంతగా అప్పు చేస్తున్నారని బొత్స నిలదీశారు.