అది మేఘా కాదు.. దగా కంపెనీ!

ఆ కంపెనీని ఎందుకని బ్లాక్ లిస్టులో పెట్టలేదు?
సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు బాధ్యత నిర్మాణ సంస్ధ మెగా ఇంజనీరింగ్ దే
మేఘా ఇంజనీరింగ్ సంస్ధది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్సే
అమృత్ స్కీం ను కూడా మెగా కంపెనీకే ఎందుకు ఇచ్చింది?
కొడంగల్ ప్రాజెక్ట్ కూడా మెఘా కంపెనీకే దక్కే అవకాశం
గతంలోనే నాసిరకం పనులు చేస్తోందని కేంద్రం నుంచి షోకాజులు
కాళేశ్వరంలో నాసిరకం పనులు జరిగాయని విచారణ
మేఘా కంపెనీ చేసిన అన్నిపనులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి
మేఘా తనంత తానుగా గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేస్తుంటే వాటర్ బోర్డు ఇంజినీర్లు ఎందుకని పర్యవేక్షించలేదు?
సుంకిశాలలో జరిగిన నష్టాన్ని మెగా కంపెనీనే భరించాలి
– బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు బాధ్యత నిర్మాణ సంస్ధ మెగా ఇంజనీరింగ్ దే. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే విషయాన్ని బయటకు రాకుండా చేసింది. మెగా సంస్థను కాపాడేందుకు గత పాలకులు, ఇప్పటి పాలకులు ప్రయత్నిస్తున్నారు. షిఫ్ట్ ముగిసిన సమయంలో ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో మేఘా ఇంజనీరింగ్ సంస్ధది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్సే.

గతంలోనే నాసిరకం పనులు చేస్తోందని కేంద్రం నుంచి షోకాజులు ఇచ్చారు. మరో పక్క కాళేశ్వరంలో నాసిరకం పనులు జరిగాయని విచారణ జరుగుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అమృత్ స్కీం ను కూడా మెగా కంపెనీకే ఎందుకు ఇచ్చింది? రేపోమాపో…కొడంగల్ ప్రాజెక్ట్ కూడా మెఘా కంపెనీకే దక్కే అవకాశం ఉంది.

ప్రజాధనం, ప్రజల ప్రాణాలతో రాష్ట్ర సర్కార్, మెఘా కంపెనీ ఆటలాడుతున్నాయి. కాళేశ్వరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విచారణను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోంది. మేఘా కంపెనీపై చర్యలు తీసుకోకుంటే ప్రజలతో కలిసి ఆందోళనకు సిద్ధం. మేఘా కంపెనీ చేసిన అన్నిపనులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి. చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధం.

సుంకిశాల ప్రాజెక్టు లో ప్రమాదం ఈ నెల 2న ఉదయం 6 గంటలకు జరిగింది. అపుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అపుడే ఈ ప్రమాద ఘటనను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు?

ఈ ఘటన జరిగినట్టు ప్రభుత్వానికి సమాచారం లేదా ? సమాచారం లేదంటే అసలు ప్రభుత్వం పనిచేస్తున్నట్టా నిద్రపోతున్నట్టా ? ఇది సర్కారుకు సిగ్గుచేటు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఆరు గంటల షిఫ్టు ముగించుకొని కార్మికులు పంపుహౌస్ బయటికి వచ్చేశారు. ఒక అరగంట ముందు ఈ ప్రమాదం జరిగి ఉంటే వందలాది ప్రాణ నష్టం జరిగి ఉండేది.

నాసిరకం నిర్మాణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నట్లు తెలుస్తోంది. సుంకిశాల ఘటన జరిగిన వారం రోజులకు, అదీ మీడియా బయట పెట్టిన తర్వాతనే ప్రభుత్వం స్పందించింది.

గత ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మరి గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తారనే కదా ప్రజలు కాంగ్రెసుకు ఓట్లేసి గెలిపించింది.

మరి కాంగ్రెస్ సర్కారు ఎందుకని ఈ ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను పర్యవేక్షించలేదు? ఈ ప్రాజెక్టు మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ శాఖను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు కదా, మరి సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి. అందులో నాణ్యతపరంగా లోపాలు ఏవైనా ఉన్నాయా అని ఎందుకు సమీక్షించలేదు. ఇది సిఎంగా రేవంత్ రెడ్డి వైఫల్యం కాదా?

సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును 2021 జూన్ లో మెగా ఇంజనీరింగ్ సంస్ధ టెండరులో దక్కించుకుంది. రూ.1,450 కోట్లతో ప్రారంభమైన ఈ కాంట్రాక్టు అంచనా వ్యయాన్ని ఆ తర్వాత రూ.2,215 కోట్లకు పెంచారు.

సుంకిశాల ప్రాజెక్టును నిర్మిస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్ధ తనంత తానుగా గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేస్తుంటే వాటర్ బోర్డు ఇంజినీర్లు ఎందుకని పర్యవేక్షించలేదు? అంటే అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా … ప్రమాదం జరిగిన విషయాన్ని మెగా ఇంజనీరింగ్ సంస్ధ ఎందుకని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు? ఎందుకని ఇష్టానుసారంగా వ్యవహరించింది? మెగా ఇంజనీరింగ్ సంస్ధ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడానికి కారణమేంటి ?మెగా ఇంజనీరింగ్ సంస్ధది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్సే .

నాడు బీఆర్ఎస్ … నేడు కాంగ్రెస్ … పాలకులు ఎవరైనా మెగా ఇంజనీరింగ్ సంస్ధకు ఎందుకని దాసోహం అంటున్నారు? మతలబేంటి …. కమిషన్లే కదా? ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకే కట్టబెడుతోందని, తెలంగాణలో కాంట్రాక్టర్లు ఎవరూ లేరా ? ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును దోచిపెడుతోందని ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలుసార్లు ఆరోపించారు.

కమిషన్ల కోసమే కేసిఆర్ సర్కారు కాంట్రాక్టులన్నీ మెగా కంపెనీకి కట్టబెడుతోందని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తామని ప్రగల్బాలు పలికింది. మరి ఏమైంది? గత ప్రభుత్వ అవినీతిపై చర్యలేవీ?
సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనపై తప్పు, గత ప్రభుత్వానిదని కాంగ్రెస్ అంటే … కాదు ఇప్పటి కాంగ్రెసు సర్కారుదే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రెండు పార్టీలు బ్లేమ్ గేమ్ ఆడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి.

తప్పు గత ప్రభుత్వానిదే కాదు, ప్రస్తుత ప్రభుత్వానిది కూడా . ఈ రెండు ప్రభుత్వాలకు ప్రాజెక్టులపై ప్రేమ కంటే, వాటి ద్వారా వచ్చే కమిషన్లపైనే ఆసక్తి ఎక్కువ. అందుకే కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

మెగా ఇంజనీరింగ్ సంస్ధ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కారు … ఆ కంపెనీని ఎందుకని బ్లాక్ లిస్టులో పెట్టలేదు? కమిషన్లకు ఆశపడి కాంగ్రెస్ సర్కారు, మెగా ఇంజనీరింగ్ సంస్ధను వదిలేయడంతో ఇప్పుడు సుంకిశాల ప్రమాదం జరిగింది.మెగా ఇంజనీరింగ్ సంస్ధపై అపుడే చర్యలు తీసుకుంటే ఇపుడీ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా ?

మొన్న అమృత్ స్కీములో కేంద్రం ఇచ్చిన నిర్మాణ పనులను కూడా రేవంత్ సర్కారు మెగా ఇంజనీరింగ్ సంస్ధకు కట్టబెట్టింది. ఇపుడు సిఎం రేవంత్ రెడ్డి సొంత అసెంబ్లీ సెగ్మెంటు కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మెగా కంపెనీకే ఇస్తారట. అంటే నాసిరకం పనులు చేస్తూ తప్పిదాలకు పాల్పడుతున్న మెగా కంపెనీకే కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నట్టు ? కమిషన్ల కోసమే కదా ?

వంద శాతం అంచనా వ్యయాన్ని పెంచి మరీ మెగా కంపెనీకి కాంట్రాక్టులు ఇస్తూ భారీగా కమిషన్లు తీసుకుంటూ గత బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం కాంట్రాక్టర్లకు భోజ్యమైంది. ప్రభుత్వం ఏదైనా పెత్తనం మెగా కంపెనీదే అవుతోంది. వేల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలవుతోంది. పరిస్దితి పేనం నుంచి జారి పొయిలో పడినట్లుగా ఉంది. గొర్రెలను తినోటోడు పోయి బర్రెలను తినోటోడు వచ్చిండు అన్నట్లు పరిస్థితి ఉంది.దొంగల పాలన పోయి గజదొంగల పాలన వచ్చింది అన్నట్లు ఉంది రాష్ట్రంలో పాలకుల పరిస్థితి.

సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనను గోప్యంగా ఉంచడానికి బాధ్యులు ఎవరో తేల్చి, వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టును మున్సినల్ శాఖ పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఈ ఘటనకు ఆ శాఖను పర్యవేక్షిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి.

ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రమాద విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిందా లేదా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. నాసిరకం నిర్మాణ పనులతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెగా కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసలు నమోదు చేయాలి. నాసిరకం పనులు చేస్తున్న మెగా కంపెనీని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్టులన్నీ వెనక్కి తీసుకోవాలి.

సుంకిశాలలో జరిగిన నష్టాన్ని మెగా కంపెనీనే భరించాలి. ప్రాజెక్టు జాప్యానికి కారణమవుతున్న కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలి. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలి. కాళేశ్వరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విచారణను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోంది.మూడు నెలలుగా కమిషన్ చైర్మన్ కు వేతనం కానీ, కావాల్సిన డాక్యుమెంట్స్ గాని ఇవ్వడం లేదంటే సర్కార్ కు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజా ధనం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్రిమినల్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలి. చేసిన తప్పిదాలను గుర్తించి మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ఇచ్చిన కాంట్రాక్ట్ పనులను తిరిగి తీసుకోవాలి.