రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకోవాలనే జే-గ్యాంగ్‌ కుట్రలు: ప్రత్తిపాటి

విజయవాడ, మహానాడు:  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలని, బ్రాండ్ ఏపీని దెబ్బతీయాలనే కొంతకాలంగా జే- గ్యాంగ్ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కొలువుదీరి కొన్నిరోజులే అయిన విషయం కూడా మరిచిపోయి… ఇక్కడ ఏదో జరిగిపోయిందంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయిదేళ్ల జగన్ హయాంలో వాళ్ల అరాచకాలకు భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్ని తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ పున: నిర్మాణం కోసం చంద్రబాబు శ్రమిస్తుంటే వాటిని ఓర్వలేక పేటియం బ్యాచ్‌ల తో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారాయన.

కొన్నిరోజులుగా వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాలు, అంబేద్కర్‌కు అవమానం అంటూ చేస్తున్న దుష్ప్రచారంపై శనివారం విడుదల చేసిన ఒక పత్రికాప్రకటనలో వైకాపా తీరును ఈ మేరకు తీవ్రస్థాయిలో తూర్పారాబట్టారు ప్రత్తిపాటి. ఇక్కడ పెయిడ్ బ్యాచ్‌లతో గల్లీల్లో ఆందోళనలు చేయిస్తూ, అక్కడ దిల్లీ రాష్ట్రపతి పాలన అంటూ హంగామా చేస్తున్న జగన్ రెడ్డి అసలు ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అహంకారానికి, అరాచకానికి పెట్టిందిపేరుగా అయిదేళ్ల పాలన సాగించిన జగన్‌ రెడ్డికి అసలు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు ప్రస్తావించే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు అందిస్తున్న 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసిన వ్యక్తి, వారిపై అంతులేని దాడులు, అత్యాచారాలు చేయించిన ఫ్యాక్షనిస్టు అయిన జగన్ గతాన్ని మరిచి గజినీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.