బెంగళూరులో జగన్ ఫుల్‌టైమ్ రాజకీయాలు!

– ఎమ్మెల్యే జీవీ విమర్శ

అమరావతి, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. అసలు పాస్‌పోర్ట్‌కు కోర్టు ఇబ్బంది లేకుంటే లండన్‌లో ఫుల్‌టైమ్‌, బెంగళూరులో పార్ట్‌టైమ్ ఉంటూ ఆంధ్రా ప్రజల్ని గాలిగి వదిలేసేవారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మంత్రి నారా లోకేష్‌ను ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దోపిడీ తప్ప ప్రజల కోసం నిలబడి పని చేద్దామని ఆలోచనలే వ్యక్తులు ఇలానే తగలబడతారని చురకలు వేశారు. నా బీసీలు, నా ఎస్సీలని మాటల కోతలు కోసిన జగన్మోహన్ రెడ్డి, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను చదువుకునే హాస్టళ్లలో బాత్రూమ్‌లు రిపేర్ గానీ, మంచినీళ్ల టాప్ వేయించడం గానీ చేయలేదన్నారు.

తన శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల సౌకర్యాల కోసం రూ.15 లక్షలు విరాళంగా ఇస్తానని మంత్రి లోకేష్‌కు చెప్పినట్టు ఎమ్మెల్యే జీవీ తెలిపారు. తన తల్లి పేరిట మహిళా జూనియర్ కాలేజీ లేదా మహిళా హైస్కూల్ పెడితే కావాల్సిన స్థలం, నిర్మాణ వ్యయంలో 25% చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. గతంలో తమ సొంత గ్రామం ఇనిమెళ్లలో తన తండ్రి పేరిట గతంలో స్థలం ఇచ్చి హైస్కూల్ తీసుకొచ్చామని, ఇప్పుడా స్కూల్‌కు కూడా అదనపు గదులు అవసరం అవుతున్నాయన్నారు. దానికి కూడా 25% విరాళం ఇస్తానన్నారు. పిల్లలకు అవసరమైన పాఠశాలలు, కళాశాలల నిర్మాణం కోసం 25% విరాళం ఇస్తే వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్‌ ను కోరినట్టు తెలిపారు.