-జగన్ వైపు మోదీ..బాబువైపు అమిత్‌షా?
– వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ
– ఓడినా భయం లేదంటూ సీనియర్ల చర్చ
– పార్లమెంటులో మోదీకి మద్దతునిస్తారట
– మోదీకి జగన్‌పై పుత్రవాత్సల్యమని గతంలోనే చెప్పిన నిర్మలాసీతారామన్
– అందుకే జగన్ బేఫికర్‌గా ఉన్నారంటున్న సీనియర్లు
– ఎన్డీఏ నుంచి తొలి ఆఫర్ మాకే వచ్చిందన్న విజయసాయిరెడ్డి
– కూటమి ఫిర్యాదులపై ఈసీ చర్యలేవీ?
– ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తేనే చర్యలు
-జగన్ ఒత్తిళ్లతోనే రఘురామకృష్ణంరాజుకు సీటు నిరాకరణ
– ఎన్డీఏలో ఇంకా జగన్ పలుకుబడి
– వైసీపీలో సీనియర్లమధ్య ఆసక్తికరమైన చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీని శ్వాసించేది ఆరెస్సెస్ అనుకున్నప్పటికీ.. శాసించేది మాత్రం మోదీ-అమిత్‌షా మాత్రమేనన్నది మనం మనుషులం అన్నంత నిజం. మోదీ శాసిస్తారు. షా అమలుచేస్తారు. వారిద్దరికీ తెలియకుండా బీజేపీ హెడ్‌క్వార్టర్‌లో ఆపీసుబాయ్‌ను కూడా నియమించలేదు. ఒకప్పుడు సంఘ్ బీజేపీని శాసించేదన్న మాట వినిపించేది. ఇప్పుడు సంఘ్‌ను మోదీ-షా శాసిస్తున్నారన్నది ఆ పార్టీవర్గాలలో బహిరంగంగా వినిపించేమాట.
అంతగా కలిసిపోయిన ఈ గుజరాతీ కవలలు, దేశంలోని ప్రాంతీయపార్టీలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. ఏ ప్రాంతీయ పార్టీ బలంగా ఉందో ముందు వాటిని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో బలపడాలన్నది వీరి కోరిక లాంటి వ్యూహం. కానీ ఇప్పటిదాకా అది ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఏపీలో ముందు టీడీపీ,ఆ తర్వాత వైసీపీ బలహీనపడితే ఆ స్థానం ఆక్రమించాలన్నది ఒక వ్యూహం. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బలహీనపరిస్తే, ఆ స్థానం ఆక్రమించాలన్నది మరొక వ్యూహం. ఇప్పటివరకూ ఈ రెండువ్యూహాల్లో ఏదీ నెరవేరలేదు. ఏపీలో టీడీపీ,తెలంగాణలో బీఆర్‌ఎస్ క్యాడర్ ఆధారిత పార్టీలు. వాటిని బలహీనపరచడం అంత సులభం కాదన్న విషయం మోదీ-షాలకు ఇప్పటికీ తెలియకపోవడమే వింత.
ఏపీలో టీడీపీని బలహీనపరచాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో,ఆ పార్టీతోనే ఎన్నికల పొత్తు పెట్టుకున్న అనివార్య పరిస్థితి. అసలు టీడీపీతో పొత్తును మోదీ వ్యతిరేకించారని, అయితే అమిత్‌షా నచ్చచెప్పడంవల్లే ఆయన అంగీకరించారన్నది, ఆ పార్టీలో వినిపించిన ప్రచారం. ఏపీలో టీడీపీకి సానుకూల పరిస్థితి ఉందని, ఆ పార్టీతో జతకడితే ఎన్డీఏ బలం పెరుగుతుందని అమిత్‌షా చెప్పిన మీదట, మోదీ అంగీకరించారని బీజేపీ వ ర్గాల్లో వినిపించే చర్చ. ఒకవేళ టీ డీపీని ఎన్డీఏ తీసుకోకపోతే, అది కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రమాదం ఉందని అమిత్‌షా విశ్లేషించిన మీదటనే, మోదీ టీడీపీతోపొత్తుకు అంగీకరించారన్న చర్చకూడా రాజకీయ వర్గాల్లో జరిగిన విషయం తెలిసిందే.
నిజానికి మోదీ ఏపీ సీఎం జగన్ అంటే అమితంగా ఇష్టపడతారని, ఆయనపై మోదీకి పుత్రవాత్సల్యం ఉందన్న మాట, బీజేపీలోబహిరంగంగానే వినిపిస్తుంటుంది. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అయితే మోదీకి జగన్ దత్తపుత్రుడని బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ నేతలు జగన్‌పై ఎన్ని విమర్శలు చేసినా, కేంద్రం కరుణించడానికి మోదీనే కారణమని, అటు బీజేపీ నేతలు కూడా చెబుతుంటారు.
తాజాగా తమను ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వచ్చినా, తాము తిరస్కరించామంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ దీనికి బలంచేకూరుస్తోంది. తాము వద్దన్న తర్వాతనే టీడీపీ ఎన్డీఏలో చేరిందని విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అసలు బీజేపీ నర్సాపురం ఎంపీ సీటు రఘురామకృష్ణంరాజుకు ఇవ్వవద్దంటూ, జగన్ చేసిన అభ్యర్ధను మన్నించిందే మోదీ అని.. ఆయన ఆదేశాలతోనే అమిత్‌షా ఆ సీటును పెద్దగా పలుకుబడి లేని శ్రీనివాసవర్మకు వచ్చేలా చూశారన్నది, బీజేపీలోఇప్పటికే వినిపించేమాట. రఘురామకృష్ణంరాజు సీటు విషయంలో, జగన్ ఒత్తిడికి తలొగ్గిన బీజేపీపై.. వైసీపీ నమ్మకం ఉంచడంలో పెద్ద ఆశ్చర్యం లేదంటున్నారు.
అలాంటి అనుబంధం ఉన్న మోదీ-షాలు ఏపీ విషయంలో, తలా ఒకవైపు ఉన్నారంటూ వైసీపీలో ఆశ్చర్యకరమైన చర్చ జరుగుతోంది. ఒకవేళ వైసీపీ ఓడిపోయినా పార్టీ భవిష్యత్తుకు వచ్చిన నష్టమేమీలేదని, మంత్రులు-సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చలో ధీమా వ్యక్తమవుతోంది. మళ్లీ మోదీనే అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు పార్లమెంటులో మళ్లీ యధాప్రకారం, తమ పార్టీ బీజేపీకే మద్దతునిస్తుందన్నది వారి చర్చల సారాంశం.
ఆరకంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, జగన్‌కు ప్రధాని మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని మంత్రులు, సీనియర్ల మధ్య చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిధున్‌రెడ్డితోపాటు.. ఎంపి పరిమళ్ నత్వానీ, అదానీల లాబీయింగ్‌తో భవిష్యత్తులో పార్టీకి వచ్చిన ప్రమాదమేమీ లేదంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అమిత్‌షా మాత్రం.. చంద్రబాబునాయుడు వైపే ఉన్నారని, పొత్తు చర్చలన్నీ వారిద్దరి మధ్యనే జరుగుతున్నాయని మంత్రులు చెబుతున్నారు.
తమకు 5 నుంచి 9 లోక్‌సభ సీట్లు వస్తాయన్నది వారి ధీమా. పొత్తులో బీజేపీకి కేటాయించిన 6 స్థానాల్లో రాజమండ్రి, రాజంపేట, అనకాపల్లిలో మాత్రమే పోటీ ఉంటుందని, మిగిలిన అన్ని స్థానాల్లో తామే విజయం సాధిస్తామని వైసీపీ సీనియర్లు ధీమాతో ఉన్నారు. అనపర్తిలో టీడీపీ పోటీ చేయకపోతే రాజమండ్రి ఎంపీ సీటు ఖాయంగా గెలుచుకుంటామని వైసీపీ చెబుతున్నారు.
కాగా కోడ్ ఉన్నప్పటికీ ఏపీలో సీఎస్, డీజీపీ సహా ఐఏఎస్-ఐపిఎస్‌లు, జగన్ ప్రభుత్వానికే కొమ్ముకాస్తున్నారంటూ ఎన్డీఏ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఇన్చార్జి డీజీపీ, సీఎస్, ఇంటలిజన్స్‌చీఫ్, సెర్ప్ సీఈఓ, ముగ్గురు డీఎస్పీలతోపాటు..కొంతమంది జాయింట్ కలెక్టర్లు, డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూకూటమి నేతలు పలుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా, పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్దగా స్పందించకపోవడంపై, కూటమిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తే తప్ప, ఏపీ కూటమి ఫిర్యాదులపై స్పందించే అవకాశాలుడంవన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ.. కూటమి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలేదంటే, ఢిల్లీలోతెరవెనుక ఏం జరుగుతుందో అంచనా వేయడం పెద్ద కష్టం కాదని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా వైసీపీ స్థానంలోకూటమి అధికారంలోకి రావాలన్న లక్ష్యం ఎన్డీఏ నాయకత్వానికి ఉంటే, పరిస్థితులు-చర్యలు ఇంత నిర్లప్తంగా, నిస్సారంగా ఉండవని విశ్లేషిస్తున్నారు.
కాగా రాష్ట్ర బీజేపీ నేతలు జన్-వైసీపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, వారు మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనకుండా, కేవలం పురందేశ్వరిపై విమర్శలకే పరిమితం కావడం కూడా చర్చనీయాంశమయింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు,ఆయన జగన్‌పై విమర్శల దాడి చేశారు. అందుకు ప్రతిగా కన్నాపై విజయసాయిరెడ్డి సహా మంత్రులు, వైసీపీ నేతలు శరపరంపరగా దాడి చేశారు. కన్నా లక్ష్మీనారాయణ కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరిమధ్యవర్తిగా టీడీపీ నుంచి 20 కోట్లు తీసుకున్నారని విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపలు చేశారు. అప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం కన్నాకు అండగా నిలవకపోగా,ఆయనను ఆ పదవి నుంచి తప్పించింది. ఇవన్నీ బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న సత్సంబంధాలకు ఒక నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.