– టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్
(ఎంఎస్.రాజు)
గుంటూరు: జగన్ కు దమ్ముంటే పులివెందుల సీటు బీసీలకు ఇచ్చి అప్పుడు బీసీలకు న్యాయం గురించి మాట్లాడాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఫిబ్రవరి 5 న మంగళగిరిలో జరగనున్న ‘జయహో బిసి’భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా బారికేడ్ల ఏర్పాటు, తాగునీటి సదుపాయం, టెంట్ల ఏర్పాట్లు వంటి పలు సౌకర్యాల గురించి నిర్వాహకులకు సూచనలు చేశారు. అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 5 న మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి నాగార్జునా యూనివర్శిటీ ఎదురు ప్రాంగణంలో జరగనున్న టిడిపి “జయహో బిసి” భారీ బహిరంగ సభ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారని చెప్పారు.బిసిలను ఆదుకునేందుకు టిడిపి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని, ఆ మేరకు మంగళవారం జరిగే “జయహో బిసి” సభలో బిసి డిక్లరేషన్ విడుదల చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.తమ పార్టీ బిసిల పార్టీ అని,ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించిందే బడుగు బలహీనవర్గాల కోసమని, తెలుగుదేశం పార్టీ పునాదులు బలహీనవర్గాలే ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చెప్పారు.
42 సంవత్సరాల టిడిపి సుదీర్ఘ పాలనలో మా పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంది బలహీనవర్గాలేనని,టిడిపి వచ్చాకే బలహీనవర్గాలు ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా అభివృద్ది చెందారని అన్నారు.2019 లో వైసిపి అధికారంలోకి వచ్చాక అనేక రకాలుగా బిసిల మీద కక్ష్య కట్టి పగసాధించిందని, అందుకు కారణం వాళ్లు టిడిపికి అండగా ఉంటున్నారనే అనే ఆరోపించారు.రేపు టిడిపి అధికారంలోకి వస్తుందని,బిసిలకు పునర్వైభవం తెస్తుందని హామీ ఇచ్చారు.
బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని చెబుతున్న జగన్ ది దొంగనాటకమని,ఓడిపోయే సీట్లను బిసిలకు ఇచ్చి జగన్ కల్ల బొల్లి మాటలు చెబుతున్నారన్నారు.దమ్ముంటే పులివెందుల సీటును బిసిలకు ఇచ్చి అప్పుడు బిసిలకు న్యాయం గురించి జగన్ మాట్లాడాలని సవాలు విసిరారు. తాము “జయహో బిసి” సభను తలపెట్టగానే వైసిపి వణికిపోతుందని, అందుకే ఎలాగైనా సభను భగ్నం చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు.
సభకు బిసిలు రాకుండా ఆర్టీసీ బస్సులు,వాహనాలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కేవలం ఈ సభను భగ్నం చేసేందుకు ఒక టీమ్ ఏర్పాటు జగన్ ఏర్పాటు చేశారని చెప్పారు. అయినప్పటికి టిడిపి పట్ల బీసీలకు ఉన్న అభిమానంతో కనీసం 3 లక్షల మంది బీసీలు సభకు తరలి వస్తారని తాము అంచనా వేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. బిసిలు తమకు అండగా ఉండే టిడిపి కోసం రాజకీయాలకు అతీతంగా,కులమతాలకు,ప్రాంతాలకు అతీతంగా పెద్దఎత్తున జయహో బిసి సభకు తరలిరావాలని ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.