సుప్రీంకోర్టు మీద నమ్మకం లేని వ్యక్తి జగన్!

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శ

సాతులూరు, మహానాడు: దేవుడి మీదే కాదు… దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రం ఉందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు స్వతం త్ర దర్యాప్తునకు ఆదేశించి… ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక సిట్‌పైనా జగన్ రెడ్డి, అతడి బ్లూ మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలే అందుకు కారణం అన్నారు. సిట్టూ లేదు బిట్టూ లేదంటున్న జగన్ అతడి గ్యాంగ్ విపరీత ధోరణలు చూస్తే లడ్డూ వివాదంపై దర్యాప్తు కూడా తమకే అప్పగిస్తే తప్ప వాళ్లెవరూ శాంతించేలా లేరంటూ ఎద్దేవా చేశారు.

నాదెండ్ల మండలం సాతులూరులో శనివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ.కోటి విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, శివాలయం బజార్, మెయిన్ రోడ్, ఓసీ కాలనీలో సీసీ రహదారులు, మురుగుకాల్వలు, కల్వర్టల నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారిద్దరూ అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తిరుమల లడ్డూ అవినీతితో అడ్డంగా దొరికిన దొంగలు జగన్ ముఠా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.