Mahanaadu-Logo-PNG-Large

జగన్.. ‘జంతర్‌మంతర్’

– జగన్ ధర్నాకు బీఆర్‌ఎస్ డుమ్మా
– ఎక్కడా కనిపించని బీఆర్‌ఎస్ నేతలు
– కూటమి పార్టీల మద్దతుతో జగన్‌కు ఊరట
– జగన్ ధర్నా పక్కనే విజయ ‘శాంతి’ తలనొప్పి
– ఢిల్లీలోనూ విజయసాయిని వదలని శాంతి భర్త
– విజయసాయికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోటీ ధర్నా
– తలపట్టుకున్న వైసీపీ నేతలు
– అటు అఖిలేష్ యాదవ్‌ను అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ
– జగన్,విజయసాయి కేసులు వివరించిన మాజీ జడ్జి
( మార్తి సుబ్రహ్మణ్యం)

స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పదన్న సామెత ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ శిబిరాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఎన్డీఏ కూటమి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ జగన్ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిర్వహించిన ధర్నా విజయవంతమయింది. అంతవరకూ బాగానే ఉన్నా.. జగన్‌పై ఏపీ వేదికగా ఇప్పటివరకూ విమర్శలు రువ్వుతున్న వర్గాలన్నీ కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్లి.. సరిగ్గా జగన్ శిబిరం దగ్గరే మరో పోటీ శిబిరం ఏర్పాటుచేసి, జగన్-విజయసాయిరెడ్డిని విమర్శించడమే.. అంత చలిలో వణికిన వైకాపా నేతలను ఉక్కపోతకు గురిచేసింది.

ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనకు వ్యతిరేకంగా వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ధర్నాకు దేశంలోని అన్ని పార్టీలనూ పిలిచారు. ఆ మేరకు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన,వీసీకే,ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకె పార్టీ నేతలు హాజరయ్యారు. ఇది వైసీపీ శిబిరానికి భారీ ఊరటనిచ్చింది.

అయితే పక్క రాష్ట్రంలో ఉన్న తన మిత్రపక్షం బీఆర్‌ఎస్ మాత్రం, ఎక్కడా కనిపించకపోవడం వైసీపీని నిరాశ కలిగించింది. తనమిత్రుడైన కేటీఆర్ తన పార్టీ ప్రతినిధులను పంపిస్తారని ఆశించిన జగన్ భంగపడ్డారు. పోనీ బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలు ఢిల్లీలో లేరా అంటే ఢిల్లీలోనే ఉన్నారు. కానీ వారికి జగన్ ధర్నా సందేశం అందకపోవడంతో, జంతర్‌మంతర్‌కు వెళ్లలేదని అర్ధమయింది. ఏపీలో జగన్ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక అదేదో సామెత చెప్పినట్లు.. ఇటీవలి కాలంలో మన‘శాంతి’ కరువైన ఎంపి విజయసాయిరెడ్డికి, అక్కడ కూడా శాంతిభర్త మనశ్శాంతి లేకుండా చేశారు. ఓ పక్క జగన్ ధర్నా చేస్తుంటే, మరోవైపు శాంతి భర్త మదన్ మోహన్ కూడా పోటీ ధర్నాకు దిగారు. తన భార్య బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని, ఆయనకు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించాలంటూ జాతీయ మీడియా ముందు గళం విప్పారు.

తాను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌తోపాటు అన్ని పార్టీల నేతలను కలసి, విజయసాయి రాజ్యసభ సభ్యత్వం తొలగించాలన్న వినతిపత్రాలు ఇస్తానని మదన్‌మోహన్ జాతీయ మీడియాకు వెల్లడించడంతో. జగన్ శిబిరం ఇదెక్కడి తలనొప్పి అని తలపట్టుకోవాల్సి వచ్చింది.విచిత్రంగా మదన్‌మోహన్ వ్యవహారాన్ని జాతీయ మీడియా చాలా ఆసక్తిగా కవర్ చేసింది.

అటు మాజీ జడ్జి రామకృష్ణ కూడా జగన్ శిబిరానికి పోటీ ధర్నా నిర్వహించారు. జగన్‌కు మద్దతు ప్రకటించి వస్తున్న సమాజ్‌వాదీపార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను రామకృష్ణ అడ్డుకున్నారు. ఐదేళ్లలో జగన్-విజయసాయిరెడ్డి ఏపీలో చేసిన అక్రమాలు, అక్రమ సంపాదనను అఖిలేష్‌కు వివరించారు. విజయసాయిరెడ్డి-శాంతి వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి వారికి మీరు ఎలా మద్దతునిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. విచిత్ర ంగా.. మాజీ జడ్జి రామకృష్ణ ఏపీ గురించి చెబుతున్నంతసేపూ అఖిలేష్, కారులో కూర్చునే ఆసక్తిగా వినడం కనిపించింది.