భవన నిర్మాణ కార్మికుల డబ్బు మెక్కిన జగన్‌

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో చివరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని కూడా దోచుకున్న దగాకోరు పాలకుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వారిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మంగళవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది వరకు ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు జగన్‌ తీరని అన్యాయం చేశారన్నారు. ఇసుక లేక, పనులు దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న భవననిర్మాణ కార్మికుల కుటుంబాలను కనీసం ఆదుకో లేదని విచారం వ్యక్తం చేశారు.

2019 నుంచి పెండిరగ్‌లో పెట్టిన పరిహారాలన్నీ తక్షణమే చెల్లించాలని ఆందోళన చేసిన వారిపై ఎదురు పోలీసు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. ప్రమాదాలు, అనారోగ్యాలతో మరణించిన భవన నిర్మాణ కార్మికులను కూడా ఆదుకోలేదన్నారు. దొడ్డిదారిన కాజేసిన వందల కోట్ల రూపాయల కార్మికుల సొమ్మును తిరిగి వారికి జమచేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలన్నీ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వంలో వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.