పేద విద్యార్థుల ఫీజు ఎగ్గొట్టిన దొంగమామ జగన్‌రెడ్డి

-ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ప్రచారం

వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగమామ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుంటే పిల్లల చదువులెలా సాగేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో వారిని నిలువునా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈపూరు మండలం వనికుంట, పెదకొండాయపాలెం, చినకొండాయపాలెం, బొగ్గరంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన ఉమ్మడి జిల్లాల పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ సంకర శ్రీనివాసరావుతో కలిసి జీవీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో స్థానికులు, నాయకులు వారికి అపూర్వస్వాగతం పలికారు. జనసందోహం మధ్య రోడ్‌షో నిర్వహించారు. వీరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.

అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యా, ఉపాధి రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం జగన్‌ ఏలుబడిలో మచ్చుకైనా కనిపించలేదన్నారు. అతడి ఐదేళ్ల పాలనలో పేద తల్లులపై ఫీజుల రూపంలో రూ.3,174 కోట్లు భారం వేశారని వాపోయారు. పూర్తి కావొస్తున్న విద్యా సంవత్స రానికి కూడా నాలుగు విడతలుగా వేయాల్సి ఉండగా ఒక్క త్రైమాసికానికే బటన్‌ నొక్కి, అందులోనూ 50 శాతం మంది ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు వేయలేదని ధ్వజమెత్తారు. పైగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌కు ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల చెల్లింపులు నిలిపివేసి పేదపిల్లలను పెద్ద చదువులకు దూరం చేశారని, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. విద్యార్థులెవరూ అధైర్య పడొద్దని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వారందరికీ అండగా ఉంటా మన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు డబ్బు వెదజల్లేందుకు సిద్ధమయ్యారని, వైసీపీ నాయకులు ఓటుకు ఎంత ఇచ్చినా తీసుకొని సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు మేడం రమేష్‌ పాల్గొన్నారు.