– వెలిగొండ ప్రాజెక్టుకు సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ
వెలిగొండ, మహానాడు: తల్లీచెల్లిని మోసం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయరని గ్యారంటీ ఏంటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఎరిక్షన్ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఏమన్నారంటే… 2014-19 లో గత తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్లు కేటాయించి 1319 కోట్లు అంటే 96 శాతం ఖర్చు చేశాం. గత అయిదేళ్ళ జగన్ పాలనలో 3518 కోట్ల బడ్జెట్ కేటాయించి, కేవలం 170 కోట్లు (0.04 శాతం) మాత్రమే ఖర్చుపెట్టారు. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారింది. టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే, ఎన్నికల ముందు వెలిగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం, దగా కాదా? రెండో టన్నెల్ లో తవ్విన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివర భాగాన పోశారు. ఈ మట్టిని తొలగించకుండా నీరు వదలడం సాధ్యం అవుతుందా?
రెండో టన్నెల్ 12వ కిలో మీటర్ దగ్గర మూడేళ్ళ క్రితమే టన్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోయి ఉంటే దానిని ఎందుకు బయటకు తీయలేకపోయారు. టీబీఎం మెషిన్ బయటకు తీయకుండా నీళ్ళు ఇవ్వడం సాధ్యమేనా? రెండు టన్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు తరలించాల్సి ఉండగా, కనీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్దితి ఉంది. 53 టీఎంసీల సామర్ద్యం ఉన్న నల్లమలసాగర్ లో కనీసం అర టీఎంసీ నీరు కూడా నిల్వ చేయలేని పరిస్దితి ఉంది. ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా జగన్ మోహాన్ రెడ్డి విధ్వంసమే కనిపిస్తోంది. ఎందుకంటే కడప జిల్లాకు చెందిన తమ అనుచరుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు అప్పగించి, పనులు పూర్తి చేయకుండానే నిధులు తీసుకుని వెళ్ళిపోయారు. 2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతులకు సైతం నోటీసులు ఇచ్చి సభకు రాకుండా అడ్డకుని పూర్తి కాకుండానే , 10 క్యూసెక్కులు కూడా రాని వెలిగొండ ప్రారంభోత్సవం అంటూ మోసం చేశారు. గత ప్రభుత్వం ఒక్కరంటే ఒక్కరికైనా పునరావాసం కల్పించిందని చెప్పే ధైర్యం ఉందా? ఒక్క గ్రామానికి కూడా పునరావాస కాలనీలు నిర్మించి, వారిని తరలించే పని చేపట్టలేదు. ఇది రైతులను మోసం చేయడం కాదా?
ఫీడర్ కెనాల్ అధ్వాన స్దితిలో ఉంది. దాని మీదుగా నల్లమల సాగర్ కు నీరు వదిలితే అది కనీసం అయిదారు చోట్ల తెగిపోయి, రిజర్వాయర్లోకి రాకుండా పోతుంది. రెండు దశల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఫేజ్-1లో హెడ్ వర్క్స్,రెండు టన్నెల్స్ , ఫీడర్ ఛానెల్, రిజర్వాయర్, రెగ్యులేటర్ వంటి నిలిచినపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి 1.19 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జగన్ తన విష పత్రిక సాక్షికి మాత్రం యాడ్స్ రూపంలో 300 కోట్లు ఇచ్చుకున్నారు. సాక్షికి ఇచ్చిన ప్రాధాన్యం వెలిగొండ ప్రాజెక్టుకు ఇవ్వలేదు. ప్రాజెక్టు పరిశీలనలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, కార్పొరేషన్ చైర్మన్ లు, కలెక్టర్, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, అధికారులు పాల్గొన్నారు.