జగన్‌… జీవితంలో అధికారంలోకి రావు.. సీఎం కాలేవు!

– ఏన్డీయే అధికారంలో ఉండగా వైసీపీకి అధికారం కల్ల!
– నిన్ను ప్రజలు నమ్మరు.. నీకు ఓట్లు వేయరు
– కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తోంది
– ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించలే..
– రెండు రోజుల నుంచి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
– తన సాక్షి పత్రికలో ప్రశ్నించే స్వరం వినిపించకూడదా అని రాశారు
– అసలు ఈవార్త వేయడానికి జగన్ కు అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా..
– గత అయిదేళ్ళలో మీరు చేసిన అరాచకాలు మరచిపోయారా?
– డాక్టర్ సుధాకర్ ను బట్టలు ఊడదీసి కొట్టి, చంపింది మీ ప్రభుత్వం కాదా?
– మీ ఇంటికి రోడ్, మీ భద్రతకు కంచె మాత్రమే వేసుకున్నారు
– ఇంకా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని మాట్లాడతారా?
– మీవన్నీ ఫేక్‌ లైవ్‌లేనని మీ వాచీయే చెబుతోంది
– మాజీ సీఎంపై బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం తీవ్ర స్వరంతో మాటల దాడి

విజయవాడ, మహానాడు: ఏన్డీయే అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల… అంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం తీవ్ర స్వరంతో జగన్ పై మాటల దాడి చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. గత ఐదు నెలలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తుందని, ప్రజలంతా ప్రశాతంగా వారి పని వారు చేసుకుంటున్నారని, ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని మేమూ స్పందించ లేదని ఆయన అన్నారు. ఇంకా, నాగభూషణం ఏమన్నారంటే..

రెండు రోజుల నుంచి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన సాక్షి పత్రికలో ప్రశ్నించే స్వరం వినిపించకూడదా అని రాశారు. అసలు ఈవార్త వేయడానికి జగన్ కు అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. గత అయిదేళ్ళలో మీరు చేసిన అరాచకాలు మరచిపోయారా? ఏబీయన్, టీవీ5 ఎందుకు బ్యాన్ చేశారు.. సాక్షి ఒక్కదానికే యాడ్ లు ఎందుకు ఇచ్చారు? ఈనాడుకు చెందిన మార్గదర్శి పై ఫిర్యాదులు లేకపోయినా ఎందుకు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు? విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? మీ నిర్వాహకం వల్ల కిషోర్ అనే వ్యక్తి కరోనాతో చనిపోయాడు. డాక్టర్ సుధాకర్ న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టి అతని మరణానికి కారణమయ్యారు. గత ఐదేళ్లల్లో మీరు చేయని అరాచకాలు ఉన్నాయా? చంద్రబాబు, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర ను అక్రమ ఇబ్బందులు పెట్టలేదా?

పవన్ ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా? మా అధ్యక్షురాలు పురంధేశ్వరి మద్యం వల్ల మరణాలు అని చూపిస్తే.. ఆమెపై అసభ్య పోస్టులు పెట్టించారు. మా సోము వీర్రాజును వదిలారా.. మా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పైనా వ్యంగ్య పోస్టులా? టీడీపీ కార్యాలయం, పట్టాభి నివాసాలపై దాడి చేయడం తప్పుకాదా? ఆనాడు ఎవరైతే తప్పులు చేశారో , బూతులు తిట్టారో వారిపైనే కేసులు పెడుతున్నారు. చంద్రబాబు మంచితనం వల్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ సుబ్బారాయుడు ఎక్కడ ఉన్నా తీసుకవస్తామని జగన్ బెదిరిస్తున్నారంటే.. ఎంత ధైర్యం ఉండాలి? సిసోడియాను వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ పూర్తిగా తీయాలి.. చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాను. రవీంద్రరెడ్డి తప్పించుకున్నాడంటే పోలీసులు సహకారం లేదా? అతను దొరికితే.. జగన్, భారతిలు బుక్ అవుతారనే తప్పించారు.

అమరావతిలో మీరు పెంచిన తుమ్మచెట్లు పీకడానికి నలభై కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మీ హయాంలో ఇసుక దోపిడీ, గంజాయి రవాణ, ఎర్ర చందనం, మద్యం అక్రమాలతో కోట్లు దోచుకున్నారు. మీ ఇంటికి రోడ్, మీ భద్రకు కంచె మాత్రమే వేసుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని మీరు మాట్లాడతారా? మీలాగా అవినీతితో డబ్బులు పోగేసుకోవడం మాకు చేతకాదు రాదు. పవన్ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లు, వారింట్లో ఆడ పిల్లల గురించి మాట్లాడితే జగన్ నోరు ఏమైపోయింది? అడ్డగోలుగా బూతులు తిడుతుంటే.. వారిని జగనే కదా ప్రోత్సహించింది. నీ తల్లి, చెల్లిని కూడా ఇంటి నుంచి కూడా గెంటేసిన ఘనుడు నువ్వు.

నీ ఇంట్లో ఒక హత్య జరిగితే.. కోర్టులో ఉన్న కేసును కూడా విత్ డ్రా చేసుకున్నావు. నువ్వు ఇప్పుడు నీతులు చెబుతావు.. బెదిరిస్తావా.
నువ్వు జీవితంలో అధికారంలోకి రావు.. సీఎం కాలేవు. ప్రజలు ఒక్కసారి చేసిన తప్పుకే చాలా బాధలు పడ్డారు. ఇక నిన్ను ప్రజలు నమ్మరు.. నీకు ఓట్లు వేయరు. స్థానిక సంస్థల కు వచ్చిన నిధులు మొత్తం మళ్లించారు. పవన్ కల్యాణ్‌ రాగానే పంచాయతీల అభివృద్దికి నిధులు ఇచ్చారు.
నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి, పారదర్శకంగా పని చేస్తున్నారు. మీ హయాంలో పిల్లల పేరు చెప్పి కూడా కోట్లు కూడేసుకున్నారు. చంద్రబాబు అనుభవంతో నేడు వేల కోట్లు నిధులు ఏపీకి తీసుకు వస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం సహకారంతో లక్షా 20 వేల కోట్లతో ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. ఈ అభివృద్ది చూశాకే వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. అందుకే ఏదొక అంశాన్ని వివాదంగా మార్చాలని కుట్ర చేస్తున్నారు.

మేం ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తాం అంటున్న వైసీపీ నే ప్రజలు ఎప్పుడే బహిష్కరించారు. మీరు ప్రజల వద్దకు వెళ్లి ఏమని ఓట్లు అడుగుతారో చెప్పండి. రిషికొండ ప్యాలెస్ ను 500 కోట్ల ప్రజాధనంతో కట్టి.. ఎవరినీ రాకుండా అడ్డుకున్నారు. మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించారో.. అప్పుడు తప్పు అనిపించలేదా? మేం ప్రైవేటు కేసులు వేస్తామని పోలీసులను బెదిరిస్తారా? మీ దగ్గర అవినీతి సొమ్ము ఉంది కాబట్టి.. కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను కూడా పెడతారు. పోలీసులు చట్టప్రకారం పని చేయండి.. వారి బెదిరింపులకు భయడాల్సిన అవసరం లేదు. పోలీసుశాఖలో చాలా మంది నిజాయతీ అధికారులు ఉన్నారు.. వారి పని వారు చేస్తారు. జగన్ లాగా.. ఖాకీ డ్రెస్ వేసుకుని ఊడిగం చేసుకునే వారిని చంద్రబాబు పెట్టుకోలేదు. మంచి అధికారులు ఎవరో గుర్తించి వారినే నియమించారు. జగన్ ను నమ్ముకోవడం వల్లే ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలుసు.

శారదా పీఠానికి అడ్డగోలుగా దారాదత్తం చేసిన స్థలం స్వాధీనం చేసుకోవడం హర్షణీయం. 200 కోట్ల స్థలాన్ని 15 కోట్లు ఎలా కట్టబెట్టావు జగన్? అమరావతిని ఆదర్శ రాజధానికి నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని రోడ్లపై తిరిగిన వ్యక్తి జగన్. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ తహతహలాడుతున్నారు. అబద్దాలను నిజం చేయడానికే వైసీపీ సోషల్ మీడియాను పెంచి పోషిస్తుంది. వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు… జగన్ సీఎం కాలేడు రాసి పెట్టుకోండి.

జగన్ ఉదయం ఏడుగంటలకు రికార్డు చేస్తే.. మధ్యాహ్నం 3 గంటలకు లైవ్ పేరుతో ఇచ్చారు. జగన్ వాచ్ లోనే ఈ నాటకం బయటపడింది.. నేరుగా మీడియా ముందు మాట్లాడే ధైర్యం కూడా జగన్ కు లేదు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించినా, అసెంబ్లీ బహిష్కరించినా.. ఎవరికీ నష్టం లేదు. ఇప్పటికైనా కుట్రలు మానుకుని.. మా మంచి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వడం తెలుసుకోండి.