పెన్షనర్ల మరణానికి జగన్, మీరే కారకులు

– జగన్ ఏ-1 అయితే మీరు ఏ-2
– వైసీపీ గెలుపు కోసమే పనిచేస్తున్నారా?
– పేదల ప్రాణాలతో రాజకీయాలేమిటి?
– నగదు నిల్వ, పెన్షనర్ల సంఖ్యపై మీకు స్పృహలేదా?
– సీఎస్ జవహర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటు లేఖ

అమరావతి: పెన్షనర్లను ఎండల్లో తిప్పి వారి మరణానికి కారణమవుతున్నారంటూ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ‘‘గత నెలలో 33 మంది, తాజాగా ఆరుగురు పెన్షన్ల మృతికి మీదే బాధ్యత. అందులో ఏ-1 జగన్ అయితే, ఆయనకు సహకరించిన మీరు ఏ-2గా బాధ్యత వహించాలి. అయినా బ్యాంకులలో నగదు నిల్వ, పెన్షనర్ల సంఖ్య, వారి వివరాలపై మీకు కనీస స్పృహ లేదా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన సీఎస్ జవహర్‌రెడ్డికి ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు లేఖ పూర్తి పాఠమిదీ..

తేది : 03.05.2024

శ్రీ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌.

విషయం : సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ – ఏప్రిల్‌, మే మరియు జూన్‌ నెలల గురించి – వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్యంతో మంచాన ఉన్నవారు పడుతున్న ఇబ్బందుల గురించి.
* * * *
నమస్కారం,
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్ని వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరం. ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారి ప్రజలకు మేలు చేసే అవకాశాలను కనీసం కూడా ఆలోచించకుండా, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరం, అత్యంత దుర్మార్గం.

వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర పెన్షన్‌ దారులు ఇబ్బందులు పడకుండా పెన్షన్‌ పంపిణీ సకాలంలో జరగాలని ఎన్నికల కమిషన్‌ 02.04.2024న ఇచ్చిన మెమోలో పేర్కొన్నది. అయినా ఆ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతూ, గత నెలలో సచివాలయాల వద్ద బారులు తీరేలా చేసి 33 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. లక్షలాది మందిని వేధించారు. ఈ నెల కూడా అదే విధంగా పెన్షన్‌ దారులను రోడ్లపై మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి, నరకయాతనకు గురి చేస్తున్నారు.

ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నప్పటికీ, ఇళ్ల వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. పైగా, బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. వెళ్లి తీసుకోండి అంటూ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపించి చెప్పిస్తున్నారు. అలా చెప్పే సమయంలో పెన్షన్‌ పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా రాజకీయ కుట్రలకు ప్రాధాన్యమివ్వడం దుర్మార్గం.

రాజకీయంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలో భాగమై.. పెన్షన్‌ నగదును బ్యాంకుల్లో జమ చేయడం వలన పెన్షన్‌ సొమ్ము తీసుకోవడానికి వృద్ధులు ముప్పతిప్పలు పడుతున్నారు. చాలా కాలంగా బ్యాంకు ఖాతాల నిర్వహణ లేకపోవడంతో లక్షలాది ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయి. మరోవైపు బ్యాంకులకు వెళ్లిన వారికి కేవైసీ పేరుతో బ్యాంకు సిబ్బంది ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు తీసుకురమ్మని చెబుతున్నారు. వాటి కోసం మండుటెండలో లబ్దిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తోంది.

మరోవైపు జాయింట్‌ ఖాతాలు, వ్యక్తిగత ఖాతాలు రెండూ ఉన్నవారికి ఏ ఖాతాలో నగదు జమయ్యిందో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గత నెల మండుటెండలో సచివాలయాల చుట్టూ తిప్పారు. ఇప్పుడు భారీగా మండిపోతున్న ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారు. లబ్దిదారులు బ్యాంకులకు ఎలా చేరుకుంటారు?

బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు ఏంటి? ఎంత మందికి పెన్షన్‌ సొమ్ము అందించాలి, వచ్చే వారికి కల్పించిన సదుపాయాలేంటి అనే అంశాలపై కనీస స్పృహ కూడా లేకుండా వ్యవహరించారు. సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించాల్సింది పోయి.. బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరే ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం అధికార పార్టీకి లాభం చేకూర్చాలనే అజెండాలో భాగమే.

ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆడుతున్న రాజకీయ పైశాచిక క్రీడలో ప్రభుత్వ అధికారిగా ఉన్న మీరు భాగస్వామిగా మారడం మీ పక్షపాత వైఖరికి నిదర్శనం. ఎక్కడో మండల కేంద్రాల్లో ఉన్న బ్యాంకుల చుట్టూ తిప్పుతూ దాదాపు 65 లక్షల మందిని అవస్థలకు గురి చేస్తున్నారు. పెన్షన్‌ లబ్దిదారులు పడుతున్న బాధలు హృదయ విదారకంగా ఉన్నా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీకు కనిపించకపోవడం వెనుక ఆంతర్యమేంటి?

గత నెలలో 33 మంది చనిపోతే, ఇప్పుడు ఒక్క రోజే దాదాపు 6గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణ హోమానికి ఎ1 జగన్‌ రెడ్డి, ఎ2 మీరే. ప్రస్తుతం రాష్ట్రంలో 43 నుండి 48 డీగ్రీల మధ్య ఉష్ణోగతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్ని, దివ్యాంగుల్ని ఇతర పెన్షన్‌ దారుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పడం ఎంత మాత్రమూ సబబు కాదు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం ఇకనైనా మానుకోవాలి. తక్షణమే ప్రతి లబ్దిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికీ పెన్షన్లు అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

(నారా చంద్రబాబునాయుడు)
జాతీయ అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ