• గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలన్నీ భూ సమస్యలపైనే…
• కూటమి పాలనలో కక్ష సాధింపులుండవ్
• తప్పు చేసిన వారిని వదిలి పెట్టం
• గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
• మంత్రి అచ్చెన్నాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు వెల్లడి
మంగళగిరి, మహానాడు: ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోన్ రావు, డాక్టర్ శివ ప్రసాద్ లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు వింటూ.. నేరుగా డీజీపీ, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి పరిష్కరించాలని వారికి సూచించారు.
– గత ప్రభుత్వంలో తమనుకొట్టి తమపైనే అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన పోలీసు అధికారులు నేడు మళ్లీ ముసుగు మార్చి ఉత్తమ పదవులు పొందుతున్నారని.. గత ఐదేళ్లు వైసీపీ నేతల అడగులకు మడుగులు వత్తిన ఆ పోలీసులు.. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారని… వారి ముసుగులు తొలగించి చర్యలు తీసుకోవాలని మైదుకూరుకు చెందిన టీడీపీ నేతలు మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. తమను కొట్టిన పోలీసుల ఫోటోలను చూపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారికి పదవులు దక్కకుండా చూడాలని వేడుకున్నారు.
– పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన రవికిరణ్ రెడ్డి, అప్పిరెడ్డి, సుమంత్ రెడ్డిలు వాపోతూ… అసలు నియోజకవర్గంలో లేకపోయిన హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిపై అక్రమ కేసు పెట్టి సుమారు రూ. 60 లక్షలు గత ప్రభుత్వంలో వైసీపీకి కొమ్ముకాసిన ఓ పోలీసు అధికారి వసూలు చేశారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అలాగే తాము చేసిన వర్క్ బిల్లులు రాలేదని వాటిని ఇప్పించాలని వాపోయారు. నర్సరీల కోసం రైతుల దగ్గర భూమి తీసుకునేందుకు గత ప్రభుత్వం తెచ్చిన రిజిస్ట్రేషన్ జీవోను రద్దు చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అగ్రిమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
– నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం కొండాపురానికి చెందిన ఎన్.సంజీవ వరప్రసాద్ విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న భూ సర్వే వలన తమ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి చూపిస్తున్నారని.. దానితో తమకు అడంగల్ రావడం లేదని.. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని అతను గ్రీవెన్స్ లో మొరపెట్టుకునాడు.
– బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం మార్టూరులోని నేతాజీ నగర్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తూ వైసీపీ నేతల అండతో గత ప్రభుత్వంలో అంబేద్కర్ భవన నిర్మాణ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టడాలు చేపట్టారని.. కట్టడాలు తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
– గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తోన్న రెగ్యులర్ ఏఎన్ఎంలకు వైసీపీ అన్యాయం చేసిందని.. ఎప్పటినుండో స్వస్థలాల్లో పనిచేస్తోన్న తమను దూర ప్రాంతాల్లో వేసి సచివాలయాల్లో కొత్తవారిని తీసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
– వైసీపీ నాయకులు కోటేరు ముత్తారెడ్డి నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. తనకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు ఎస్సీలమైన తమపై దాడులు చేసి గ్రామం నుండి వెలివేశారని తెలిపారు. దాంతో ఆరు నెలలుగా తెలంగాణలో ఉంటున్నామని, ఊరిలో తమతో ఎవరూ మాట్లాడనివ్వకుండా.. మంచినీళ్లు సరుకులు ఇవ్వకుండా చేశారని… దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్సై వైసీపీ నాయకులకే మడుగులొత్తుతున్నారని నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన నిప్పుల పల్లి కోటేశ్వరరావు వాపోయాడు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై మంత్రి నందిగామ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
– ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని వైసీపీ నేతలు అక్రమంగా ఆన్ లైన్ చేసుకుని పట్టా తీసుకున్నారని… 1983లో ఆ భూమిని ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చిందని.. ఆయన మరణాంతరం ఆ భూమిని తాము అనుభవిస్తున్నట్టు .. అయినా వైసీపీ నేతలు అక్రమంగా ఆన్ లైన్ లో ఎక్కించుకున్నారని.. దాన్ని తొలగించి, తమకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామస్తుడు జెల్లి మస్తాన్ వాపోయాడు.
– రూ. 2 వడ్డీకి 50 వేలు తీసుకుంటే దానికి 3 లక్షలు కట్టమని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని తమను ఊరిలోకి రానివ్వడంలేదని.. డబ్బులు కట్టకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని మంత్రాలయానికి చెందిన్న జమ్మన గ్రీవెన్స్ ఫిర్యాదు చేశాడు. మంత్రాలయానికి చెందిన మరొక వ్యక్తి బుడగ జంగం కూడా ఫిర్యాదు చేస్తూ.. వైసీపీ నేత భీమా దగ్గర తీసుకున్న లక్షకు 10 లక్షలు వడ్డీ కట్టమని బెదిరిస్తున్నాడని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
– అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ పంచాయతీ గవర్ల అనకాపల్లికి చెందిన పొలమరశెట్టి మురళీ కృష్ణ వాపోతూ.. తాను టీడీపీలో ఉత్సాహంగా పనిచేస్తోన్నందున గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు తనపై అక్రమ కేసులు పెట్టారని ఆ అక్రమ కేసులు తొలగించాలని వేడుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుదూ..
ఒక ప్రభుత్వం మారిన తరువాత ప్రజల బాధలను ఈ స్థాయిలో చూడటం ఇదే మొదటిసారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అర్జీలు ఇవ్వడం, బాధలు చెప్పుకోవడం తప్పా ఏమి కనిపించడంలేదన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంత కార్యక్రమాలు చేయడంతో నేడుప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికంగా భూ సమస్యలపైనే వినతులు వచ్చాయని తెలిపారు.
తాతల తండ్రుల నుండి వచ్చిన భూములు ఇప్పటికి కూడా వారి ఆధినంలోనే ఉన్నా.. రికార్డులు తారుమారు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అడ్డగోలు వ్యవహరాలు చేయడం, నిబంధనలు పాటించకపోవడం… జగనన్న భూ సర్వే పేరుతో పెద్ద బోగస్ సర్వే చేపట్టి ప్రజల మధ్య తగాదాలు పెట్టి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టరని మండిపడ్డారు. ప్రజలు తెచ్చిన సమస్యలపై కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఇది ప్రజా ప్రభుత్వం… ఏ చిన్న సమస్యైనా దాని పరిష్కారానికి టీడీపీ కృషి చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ లు ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన ఆలోచన హర్షణీయమన్నారు. ఒక జిల్లా, ఒక ప్రాంతం కాకుండా రాష్ట్రం మొత్తం భూ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దానికి శాశ్వత పరిష్కారం కోసం.. రాష్ట్రం ప్రభుత్వం త్వరలోనే రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోన్నట్టు పేర్కొన్నారు. గత అయిదేళ్ళలో ఎవరికైతే ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ళలో ఎక్కడెక్కడైతే దోపిడీ జరిగిందో ఎక్కడైతే అవినీతి జరిగిందో వాటన్నింటిని బయటపెడతామని మేము చెప్పడంతో… ఆ భయంతో రికార్డులను తగలబెడుతున్నారన్నారు.
పోలవరంలో నిర్వాసితులకు, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకుండా వైసీపీ నేతల సొంత పార్టీ వారికి విపరీతంగా పరిహారం ఇచ్చి అక్రమంగా దోచుకున్నట్టు తెలిపారు. వాటిని నేడు ప్రభుత్వం బయటకు తీస్తోందని భయపడి రికార్డులను తగలబెట్టారన్నారు.
తిరుపతిలో వెంకన్న ధనాన్ని దోచుకున్నారు…. అవి బయట పడతాయని ఫైల్స్ ను దగ్గం చేశారు. ఈ ఘటనలపై మా అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ ను ఐదు జోన్ లు గా పెట్టి ఒక్కో జోన్ కు ఒక్కో ఆఫీసర్ ను నియమించుకొని.. దోపిడీకి అడ్డులేకుండా చేసుకుని, ఇసుక, మైనింగ్, రేషన్, అక్రమ మద్యం దేన్ని వదలకుండా అక్రమ రవాణా సాగించారు. ఈ దందాకు నాడు ఓ అధికారి సహకరించాడు. ఆయన పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఇటువంటి దారుణాలపై ఎంక్వైర్వీ వేస్తాం. ఎవరు తప్పు చేసిన వారిని విడిచిపెట్టం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎక్సైజ్ తో పాటు చాలా శాఖల్లో భారీ అవినీతి జరిగిందని అన్నింటిని బయపెట్టి అక్రమార్కులను కటకటాల్లోకి నెడతామన్నారు.