Mahanaadu-Logo-PNG-Large

జగనేయుల పత్తేపారం!

– ‘మహిళా’సేవలో వైకాపేయులు
– అక్కచెల్లెమ్మను పట్టించుకోని జగనన్న
– దువ్వాడ దువ్వువుడిని జగనన్న మెచ్చుకున్నారా?
– ఇంతకూ జగనన్న మద్దతు ఎవరికి?
– తమ్ముడు శీను అసలు భార్య వాణికా? కొసలు మరదలు మాధురికా?
– మొన్నటివరకూ ఉత్తరాంధ్రలో ఇద్దరు రెడ్ల కళాపోసన
– వైసీపీకి ఇంకా తగ్గని ఎండోమెంట్ అ‘శాంతి’
– ఇప్పటికే వైసీపీకి శ్రీరెడ్డి సేవల శ్రమదానం
-గతంలో పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు
– ఇప్పుడు దువ్వాడ ఎపిసోడ్‌లో మళ్లీ అవే తెరపైకి
– ఇదేం పత్తియాపారమంటూ తలపట్టుకుంటున్న జగనేయులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పూర్వం చక్రవర్తులు, రాజులు కళలను పోషించేవారు. కళాకారులను ప్రోత్సహించేవారు. స్వయంగా వారూ కళాపోసన చేసేవారు. అది వేరే వ్యవహారం. రాజుల కాలం అంతరించి, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కళాకారులను పోషించేవారు లేకుండా పోయారన్న ఆవేదన- దిగులూ గత ఐదేళ్ల క్రితం వరకూ ఉండేది. కానీ మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌ రెడ్డికి, దేవుడిచ్చిన తమ్ముడయిన జగనన్న వైసీపీ పెట్టిన త ర్వాత, కళాకారులకు ఆ దిగులు తీరింది. జగనన్నియ్య ఆవిధంగా కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకెళుతున్నారు.

దానితో జగనన్న పార్టీలో కళాకారులతోపాటు.. గంట-అరగంట పార్ట్‌టైమ్ కళాకారులు’ కూడా ‘తీరికలేనంత కళాపోసన’లో బిజీగా అయ్యారు. అంటే ఆ రకంగా మహిళా సేవలో ముందుకువెళుతుంటే, మధ్యలో ఈ దుర్మార్గ మీడియా రంధ్వ్రానేషణలు కొన్ని.. జగనేయుల కర్మ కాలి తమంతట తాము దొరికి మరికొన్ని.. మధ్యలో అక్కచెల్లెమ్మలు మీడియా ముందుకొచ్చి, జగనేయుల కళాపోసన బయటపెట్టిన కేసులు ఇంకొన్ని బయటపడుతున్నాయి. లేకపోతే వైకాపేయుల మహిళాసేవ బయట ప్రపంచానికి తెలిసేదికాదు. జగనేయులకు ఇలాంటి ప్రచారం అస్సలు నచ్చదు. గుప్తదానం మాదిరిగా ఇదో గుప్తసేవ అన్నట్టు! గంటయినా-అరగంటయినా రెండో కంటికి, రెండో చెవికి వినపడకుండా లాగించేయడమే వారికి ఇష్టం!!

రెండురోజుల నుంచి శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మహిళా సేవ యవ్వారాన్ని, స్వయంగా ఆయన భార్య వాణినే బట్టబయలు చేసింది. కట్టుకున్న భార్యనయిన తనను, కూతురుని వదిలేసి మాధురి అనే మహిళకు సేవ చేస్తున్నారంటూ, ఆమె ఏకంగా దువ్వాడ ఇంటి ముందు బైఠాయించడంతో దువ్వాడ ఫ్యామిలీ కథ గత్తరయింది.

ఏమాటకామాట. మాధురి అనే కళాకారిణి కూడా వైకాపేయురాలే. ఆమె చేసిన డాన్సులను వీడియోల ద్వారా జాతికి అంకితం చేసిన గొప్ప కళాకారురాలు. శీనన్నయ్య ఆమెలోని టాలెంటును బాగా ప్రోత్సహించడంతో, పార్టీలో చేరిన వెంటనే మహిళా అధ్యక్షురాలయింది. ఎంత టాలెంటు లేకపోతే పార్టీలో చేరిన వెంటనే పార్టీ అధ్యక్షురాలు కాగలుతుంది చెప్పండి? ఆ టాలెంటే శీనన్నియ్యను అట్రాక్టు చేస్తే, ఆయన భార్య వాణికి అనుమానం రేపింది.

మరి ఈ కళాకారుల కళాపోసన సిక్కోలు దాటి సోషల్‌మీడియా పుణ్యాన పెపంచకం మొత్తానికి తెలిసింది కాబట్టి.. మహిళా బాంధవుడయిన జగనన్నియ్య రంగంలోకి దిగి, మ్యాటర్ సెటిల్‌ చేసి, తమ్ముడు శీను మందలిస్తారేమోనని జగనేయులు ఆశించారు. కానీ విచిత్రంగా జగనన్నియ్య.. తమ్ముడు శీనుకు అన్యాయం జరిగింది కాబట్టి, రాష్టంలో రాష్ట్రపతిపాలన పెట్టి ధర్నా చేయాలని డిసైడ్ అయ్యారట. ‘ఈ పత్తియాపారానికి మళ్లీ ధర్నాలు కూడానా’.. అని పార్టీలోని అక్కచెల్లెమ్మలు నోరెళ్లబెడుతున్నారట.

పైగా తమ్ముడు శీను, మాధురితో వైసీపీ బలోపేతంపై ‘చర్చిస్తున్న’ సమయంలో వారిద్దరికీ అక్రమ సంబంధం అంటకట్టడం దారుణమని, జగనన్నియ్య తన ప్రకటనలో బాధపడిపోయారు. అసలు సదరు మాధురి అనే కళాకారిణి.. ఈ పత్తేపారం ఇప్పటిది కాదని, చాలాకాలం నుంచి నడుస్తోందని మీడియా ముందే సెలవిచ్చింది.

‘శీను నాకు ఫ్రెండ్-గైడ్-ఫిలాసఫర్. మేమిద్దరం కలసి ఉంటున్నాం. నేను ఆత్మహత్య చేసుకోబోతే నన్ను కాపాడారు. నీకు నేను తోడుగా ఉంటానన్నారు. నాకూ-ఆయనకూ విడాకులు కాలేదు. మాది టెక్కలి-మీదీ టెక్కలే కాబట్టి ఆ ప్రకారంగా కలసి ఉంటున్నాం. మాది సహజీవనం కాదు. ‘అడల్టరీ’ అని ఎందుకు అనుకోరు? ఏదేమైనా నేను శీనుగారితోనే ఉంటా’ నని మాధురి చక్కటి తెలుగులోనే సెలవిచ్చింది.

దానితో నె టిజన్లు మాధురి అమ్మడు వాడిన, అడల్టరీ ఇంగ్లీషు పదానికి అర్ధమేమిటో అన్వేషిస్తే.. వ్యభిచారం-రంకు-కల్తీ/వ్యభిచారం అని గూగుల్‌మాత గుట్టువిప్పింది. నెటిజన్లు సేమ్ టు సేమ్ అదే కాపీని సోషల్‌మీడియాలో పేస్ట్‌చేసి, మాధురి ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని తెగ మెచ్చేసుకుంటున్నారు. అది వేరే కథ. అసలు తమ్ముడి శీను కళాపోసనకు- రాష్ట్రంలో రాష్ట్రపతిపాలనకూ సంబంధం ఏమిటో వైకాయేయులకు అర్ధం కావటం లేదట.

జగనన్నియ్య చెప్పినట్లు.. తమ్ముడు శీను-మరదలు మాధురి పార్టీ బలోపేతంపై ‘అంత సీరియస్‌గా’ చర్చిస్తున్నప్పుడు, గేట్లకు తాళాలెందుకు? శీను భార్య-కూతురు వచ్చి తలుపు పగలకొట్టేంత లెవల్లో శీను-మాధురి ఏం చర్చిస్తున్నారు? నాలుగేళ్ల తొమ్మిదినెలల తర్వాత, జగనన్నియ్యను ఎలా సీఎం చేయాలి? టెక్కలిలో ఎక్కడ సెక్రటేరియేట్ కట్టాలని చర్చిస్తున్నారా ఏంది బుల్లోడా’ అంటూ నెటిజన్లు తెగ పరాచాకాలాడుతున్నారు.

ఇంతకూ జగనన్నియ్య మద్దతు.. తమ్ముడు శీను అసలు భార్య వాణికా? కొసరుగా వచ్చిన కొత్త మరదలు మాధురికా? అన్నది అటు జగనేయులకూ అర్ధం కావడం లేదట. ఎందుకంటే తమ్ముడు శీను భార్య, జగనన్న ఒరిజినల్ మరదలు వాణి కూడా, వైకాపేయురాలే కాబట్టి!

దాని దుంపతెగ.. అదేంటో చిన్నప్పటి నుంచీ శ్రీకాకుళం జిల్లాలో మహిళాసేవకుల సంఖ్య ఎక్కువే. ఎన్టీఆర్-చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసి, తర్వాత ‘ఫ్యాను’ కింద సేదదీరి.. మొన్నటి పాలనలో పెద్ద కుర్చీ ఉన్న ‘పెద్ద హోదా’ లో పనిచేసిన ఓ రాముడి కళాపోసన, అప్పట్లో పెద్ద సంచలనం. ఆయన భార్య స్వయంగా టీడీపీ అధినేత ఇంటికి వచ్చి, తన భర్త ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య అంటూ క్యాబినెట్ మీటింగుకు వచ్చిన, ప్రతి మంత్రికీ చెప్పేసిన వైనం, నాటి తెదేపాపేయులందిరకీ తెలిసిందే. సారుకు అప్పట్లో మహిళలకు విపరీతమైన సేవ చేసేవారన్న పేరుంది. ఇప్పుడు రాజకీయాల్లో వెలిగిపోతున్న మరికొందరు మహానేతలూ, కళాపోసకులేనన్నది బిహ రంగ రహస్యం. మరి సిక్కోలా? మజాకానా? అన్నట్లు.. ఆ జమానాలో మన లక్ష్మీపార్వతి కూడా సిక్కోలు నుంచే గెలిచిందండోయ్!

అసలు జగనేయుల కళాపోసనకు కళాప్రపంచమే నివ్వెరపోతోందట. ఒక ఎంపీ రెడ్డిగారే నా భార్యకు కడుపుచేసి, బిడ్డకు తండ్రయ్యాడని… ఒరిజినల్ మొగుడొచ్చి ధర్నా చేస్తాడు. సదరు ఎంపీ గారేమో, నాకే పాపం తెలియదంటారు. అలాగైతే డీఎన్‌ఏ టెస్టు చేయించు చూద్దామని, ఆ మొగుడుగారు సవాలు విసురుతారు. పార్టీకి ఏమిటీ అ‘శాంతి’ అని, వైకాపేయులు తలలుపట్టుకుంటున్నారు. సారు ఆవిధంగా ఉత్తరాంధ్రలో విశేషమైన మహిళా సేవలందించారట.

కొన్నేళ్లు టీటీడీని వెలిగించి, ఉత్తరాంధ్రను దున్నేసిన ఇంకో రెడ్డిగారు కూడా కళాపోసకుడేనన్నది జగనేయుల ఉవాచ. సారు టీటీడీని వెలిగించిన సమయంలో, ఒక మహిళకు ‘విశేష అర్చన’ చేసిన యవ్వారం గబ్బయిదంట. అమ్మడు వాటిని వీడియోలో భద్రం చేసుకుని సారుకు చూపిస్తే.. కంగారుపడ్డ సారు, కొండ కింద ఉన్న ఇంకో ఎస్పీ రెడ్డిగారిని పిలిచి, అదేదో సెటిల్‌ చేయమన్నారట. దానితో రంగంలోకి దిగిన ఎస్పీ రెడ్డి గారు సదరు మహిళను పిలిచి.. లెక్క సెటిల్‌చేసి, అటుంచి అటే విమానం ఎక్కించి విదేశాలకు పంపించారట. తర్వాత ఎస్పీ సారు ఇదంతా నిఘా దళపతికి చెబితే.. ఆ సారు జగనన్నియ్య చెవిలో ఊదారన్నది అప్పటి తాడేపల్లి కాంపౌండ్ టాక్.

ఈ సారుకు సైతం.. కులమత ప్రాంతాలకు అతీతంగా మహిళలకు విశేష సేవలందిస్తారన్న పేరు పార్టీలో బాగా ఉందట. ఇక అధికారం ఉన్నరోజుల్లో.. ఇద్దరు మంత్రుల గంట-అరగంట మహిళాసేవలన్నీ సోషల్‌మీడియాలోనే వచ్చినందున, మళ్లీ ఆ ముచ్చట అనవసరం.

ఇక ‘సలహా రెడ్డి’గారి మహిళా సేవల గురించి, అప్పట్లో తాడేపల్లి టు శ్రీకాకుళం వరకూ టామ్ టామయిపోయింది. సారు చలవ వల్ల మినిష్టర్లు అయిన వాళ్లూ ఉన్నారని, అప్పట్లో ‘సారు బాగా బిజీ’ అన్నది తాడేపల్లి కాంపౌండ్ నుంచి వినిపించిన వార్త.

అప్పట్లో ఇజయనగరం పెద్ద మంత్రి గారు విదేశాలకు తీసుకెళ్లిన గుంటెవరంటూ అప్పట్లో సోషల్‌మీడియాలో ఓ వీడియో నానా చండాలం సేసేసినాది. లేటెస్టుగా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెన్ని బంధువు, స్కూలు పిల్లలతో సరసాలాడుతుంటే, వాళ్ల తల్లులొచ్చి చీపుర్లతో బడితపూజ చేసిన వీడియోలు వైకాపాను గబ్బు పట్టించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జగనేయుల శృంగారకథలకు పేజీలు చాలవు.

ఇక వైసీపీ కోసం రెక్కలుముక్కలు చేసుకుని, ‘రాత్రింబవళ్లు శ్రమదానం’ చేసిన యూట్యూబర్, శ్రీరెడ్డి రెక్కలకష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు న్యాయం చేయాలంటూ అమ్మడు ఫిలింనగర్‌లో నిస్సిగ్గుగా ప్రదర్శించిన ‘విశ్వరూపం’.. ఆ తర్వాత జగనన్నకు మద్దతుగా చంద్రబాబు-పవన్-లోకేష్‌ను ఏకిపారేసిన శ్రీరెడ్డి శ్రమదానం గురించి, ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది.

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. పెద్దసార్లు విరివిరిగా మహిళాసేవ చేయగా లేనిది, తామెందుకు చేయకూడదన్న స్ఫూర్తి అప్పటి వాలంటీర్లలోనూ రగిలింది. ఫలితంగా చాలామంది వాలంటీర్లు కూడా, మహిళా సేవ మొదలెట్టిన వైనం పోలీసులదాకా చే రిన కథ తెలిసిందే.

‘ఒంటరిగా ఉన్న మహిళలకు సేవ చేయాలన్న తపన’తో, పాపం వాలంటీరు తమ్ముళ్లు కేసులపాలయ్యారు. వాలంటీర్ల మహిళా సేవ గురించి జనసేనాధిపతి మీడియాకు చెబితే, వాలంటీర్లకు బోలెడు కోపమొచ్చి, హర్టయ్యారు. ఆయనపై మహిళాకమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన పద్మ మేడం కూడా, పవన్‌కు నోటీసులిచ్చిన యవ్వారం తెలిసిందే.

ఈవిధంగా జగనేయుల కళాతృష్ణ, అధికారం పోయిన తర్వాత కూడా చల్లారడం లేదు. దానికి జగనన్నియ్య కూడా తనవంతు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తమ్ముడు శీను-మరదలు మాధురి ఎపిసోడ్‌తో తేలింది. ఎందరో శీనులు-అందరికీ వందనాలు!

కానీ ఈ ఎపిసోడ్‌లో దుర్మార్గ సోషల్‌మీడియా.. అప్పట్లో జగనన్న జనసేనాధిపతి పెళ్లిళ్లపై చేసిన విమర్శలు, దువ్వాడ శీనన్న పుణ్యాన మళ్లీ తెరపైకి వచ్చాయి. పెళ్లాలను మార్చడం ఏమిటని జగనన్న పాత ప్రశ్నకు.. లేటెస్టు దువ్వాడ దువ్వుడు యవ్వారం వీడియోలు పెట్టి, నెటిజన్లు జగనన్నను తెగ ఆడేసుకుంటున్నారు. నోరుజారాం.. మరేటిసేత్తాం?!