జగన్‌కు కాపులే దిక్కు!

– కనిపించని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి
– గతంలో సకలశాఖామంత్రి సజ్జలదే హవా
– మీడియాలో అంతా ఆయనే
– ఉత్తరాంధ్ర-సీమలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి
– పత్తాలేని రోజా, కొడాలి నాని, వంశీ, జోగి
– ఇప్పుడు భూతద్దం వేసి వెతికినా కనిపించని రెడ్లు
– వైసీపీకి ఇప్పుడు కాపునేతలే దిక్కు
– ‘దేశం’పై బొత్స, అంబటి, పేర్ని, గుడివాడ ఎదురుదాడి
– ఉమ్మారెడ్డికి అన్యాయంపై అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాపులంటే వైసీపీ అధినేత జగన్‌కు అస్సలు గిట్టదు. అది బహిరంగమే. కాపులకు రిజర్వేషన్లు కూడా ఇచ్చేది లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. తన చుట్టూ ఉన్న అందరికీ ‘రెడ్డి’ కార్పెట్ పరిచారు. ఇటు చూస్తే విజయసాయిరెడ్డి.. అటు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి.. మరో వైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎంఓలో ధనంజయరెడ్డి.

ఎటుచూసినా రెడ్లే. పెత్తనమంతా వారిదే. ఇప్పుడు జగన్ అధికారం వియోగం అనుభవిస్తున్నారు. మరి పెత్తనం చేసిన రెడ్లంతా ఏమయ్యారు? ఇప్పుడు భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదెందుకు? జగన్ కాదనుకున్న కాపులే ఎందుకు దిక్కయ్యారు? రెడ్లు మీడియా ముందుకొచ్చేందుకు ఎందుకు జంకుతున్నారు? పెత్తం రెడ్లది.. పల్లకీమోత కాపులకా?.. ఇదీ ఇప్పుడు వైసీపీలో కొత్తగా మొదలైన ‘కుల’కులం!

ఐదేళ్ల జగన్ జమానాలో రెడ్లదే హవా. సీఎంఓ నుంచి పార్టీలో పదవుల వరకూ వారిదే హవా. అన్ని శాఖలకు సంబంధించిన ప్రెస్‌మీట్లు సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహిస్తే, సంబంధిత శాఖల మంత్రులది ప్రేక్షకపాత్ర. చంద్రబాబు-లోకేష్-పవన్‌పై ఆయన చెలరేగిపోయేవారు. పేరుకు హోంమంత్రి ఉన్నా పెత్తనమంతా ఆయనదే.

జగన్ కూడా మంత్రులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా, ఆయనొక్కరితోనే మాట్లాడతారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయనను కలిస్తే, జగనన్నను కలిసినంత పుణ్యం అన్న భావన. సీఎం, మంత్రుల పేషీల వద్ద కనిపించని జనం, ఆయన ఆఫీసుసులో కిటకిటలాడేవారు. అధికారం పోయిన తర్వాత అంతలావు సజ్జల సైలంటయ్యారు. అసలు ఆయనచ్చిన సలహాల వల్లే పార్టీ మునిగిపోయిందని, సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డి పెత్తనం కూడా పార్టీ కొంపముంచిందని వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బాహాటంగానే విరుచుకుపడ్డారు.

అందులో ధనంజయరెడ్డి రిటైరయిపోగా, సజ్జల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక సోషల్‌మీడియాలో చంద్రబాబు-లోకేష్-పవన్ వ్యక్తిత్వహన నానికి, నాయకత్వం వహించిన సజ్జల కొడుకు భార్గవరెడ్డి కూడా పత్తా లేరు.

ఇక ఉత్తరాంధ్ర, కోస్తాలో అంతులేని అపరిమత అధికారం అనుభవించిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారె డ్డి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. సుబ్బారెడ్డి అప్పడప్పుడు జగన్ పక్కన ఫొటోలో కనిపిస్తుండగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌కు పరిమితయ్యారు. ఆయనకు మన‘శాంతి’లేకుండా చేసిన ఆరోపణల వ్యవహారంతో, ఒకసారి మీడియాముందుకొచ్చారు. ఇక సీమను కంటితో శాసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీకల్లోతు ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుని, చివరకు సొంత నియోజకవర్గంలో కూడా కాలుపెట్టని విషాదం.

ఐదేళ్ల జగన్ జమానాలో టీడీపీ-జనసేన, బాబు-పవన్-లోకేష్‌పై నోరు పారేసుకుని, బూతులు మాట్లాడి చెలరేగిపోయిన రోజా, కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. రోజా చెన్నై, హైదరాబాద్‌లో ఎక్కువకాలం గడుపుతుండగా, వల్లభనేని వంశీ పరారీలో ఉన్నారు. గుడివాడ నాని భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో కాపు ద్వేషిగా ఆ సామాజికవర్గంలో ముద్రపడ్డ జగన్‌కు, విచిత్రంగా కాపునేతలే దిక్కయిన వైనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అధికారంలో ఉండగా అన్నీ అనుభవించిన రెడ్లు.. ఇప్పుడు కూటమి సర్కారుపై మాట్లాడేందుకు వణికిపోతుండగా, కాపు నేతలతో ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్న వైచిత్రి విమర్శలకు దారితీస్తోంది.

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాధ్, అంబటి రాంబాబు, పేర్ని నాని మాత్రమే ఇప్పడు వైసీపీకి దిక్కయ్యారు. కూటమి సర్కారుపై నాయకత్వం వీరితోనే విమర్శలు చేయించడంపె, ై కాపు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉండగా పెత్తనం అనుభవించిన రెడ్లను వాడుకోకుండా, పనికిరానివారంటూ మంత్రివర్గం నుంచి తొలగించిన కాపునేతలే మీకు దిక్కయ్యారా? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అప్పుడు రోజూ ప్రెస్‌మీట్లు పెట్టిన సజ్జల ఏమయ్యారు? సోషల్‌మీడియా ద్వారా కూటమిపై నిప్పులు చెరిగిన సజ్జల భార్గవరెడ్డి ఎక్కడున్నారు? ఉత్తరాంధ్ర-కోస్తాలో పెత్తనం చేసి, అన్ని పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏమైపోయారు? పదవులు అనుభవించిన వారితో విమర్శలు చేయించకుండా, కాపులను ద్వేషించిన జగన్.. అదే కులం నేతలతో ఎలా ప్రెస్‌మీట్లు పెట్టిస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

‘పదవులు రెడ్లకు, పల్లకీమోత కాపులకా? ఇప్పుడు కాపు నేతలతో కూటమిని తిట్టించి రెడ్లను కాపాడుతున్నారా? పదవులు అనుభవించిన రెడ్లతో కూటమిని ఎందుకు తిట్టించరు? అంటే మీ కులం వాళ్లు క్షేమంగా ఉండాలి. కాపులు కేసులు పెట్టించుకుని నాశనం కావాలా?’ అని విమర్శిస్తున్నారు.

ఇదిలాఉండగా..కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు ఎక్కడా కనిపించకపోవడంపై పార్టీలో చర్చనీయాంశమయింది. ఆయన అల్లుడు కిలారి రోశయ్య ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఎంతో అనుభవం ఉన్న ఉమ్మారెడ్డి సేవలను వినియోగించుకోకుండా అవమానించిన నాయకత్వం.. చివరకు ఆయనకు కౌన్సిల్ లో విపక్ష నేత కూడా ఇవ్వకుండా, రెడ్డికి పట్టం కట్టి ఉమ్మారెడ్డిని పక్కనపెట్టిందంటున్నారు.