జగన్మోహన్ రెడ్డి చిట్టెలుక

గంగ చంద్రముఖి గా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకల మారడమే వెరైటీ
వాలంటీర్ల ముసుగు తీసేశారు

మీరే నా సైన్యమని… పార్టీ గెలుపు కోసం పని చేయాలన్న జగన్మోహన్ రెడ్డి
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అని, రాజధాని ఫైల్స్ సినిమాకు సింహం జంకిందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. గంగ చంద్రముఖి గా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.

శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిలు వస్తారని మోహన్ రెడ్డి గారు ముద్దు ముద్దుగా మాట్లాడు తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రముఖి అంత బ్యాడ్ క్యారెక్టర్ ఏమీ కాదమ్మా… అంటూ సెటైర్లు వేశారు. బహుశా ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియక పోవచ్చునని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

రాజధాని ఫైల్స్ సినిమానే కాకుండా ఇంకా చాలా సినిమాలు రావచ్చు. ఓటీటీలో కూడా బాబాయ్ అనే సినిమా కూడా వస్తుందట అని అన్నారు. రాజధాని సినిమా దర్శకుడు భాను, నిర్మాత కంఠం నేని రవిశంకర్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజధాని ఫైల్స్ సినిమాను మనసున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుతున్నానని అన్నారు.

వ్యూహం సినిమా కోసం నేను చేసిన శపథానికి కట్టుబడే ఉన్నా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా కోసం నేను చేసిన శపథానికి కట్టుబడే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వ్యూహం సినిమా విడుదలైన రోజు ఉదయాన్నే హైదరాబాదులోని థియేటర్లో మార్నింగ్ షో చూసి, థియేటర్ కు సినిమా చూడడానికి ఎంత మంది ప్రేక్షకులు వచ్చారో ఫోటో తీసి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ట్యాగ్ చేస్తానని చెప్పారు. నేను అన్న మాట ప్రకారమే మార్నింగ్ షో సినిమా చూశాను… థియేటర్లో పెద్దగా ప్రేక్షకులు లేరని అంటానా?… అయ్య బాబోయ్ సారీ రాము, థియేటర్ ఫుల్ అయిపోయినాది అంటానా?? అంటూ చమత్కరించారు. వ్యూహం సినిమా కుదిరితే మార్నింగ్ షో దర్శకుడు రాంగోపాల్ వర్మతోనే కలిసి చూస్తానని చెప్పారు.

దిగజారుడు రాజకీయానికి ఇది నిదర్శనం

రెండు సినిమా సెన్సార్ చేయించుకుని రిలీజ్ డేట్ దగ్గరగా పెట్టుకొని, ఓ ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి రైతుల గొంతు కోసిన విధానాన్ని రాజధాని ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపెడితే, ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయడమనేది దిగజారుడు రాజకీయం అని అనడానికి నేను వెనకాడనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. సినిమా లో రైతుల కష్టాలు, వారి త్యాగాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టిన విధానం, హృదయం ఉన్న ప్రతి వ్యక్తిని, అన్నం తింటున్న ప్రతి వ్యక్తిని ఆకట్టుకుంటుంది. అన్నం తినే ప్రతి వ్యక్తిని అని ఎందుకు అన్నానంటే… రైతులు ఆరుగాలం శ్రమిస్తే తప్పితే పంట చేతికి రాదు. వాళ్లు పండించిన పంటను తినే ప్రతి ఒక్కరూ రైతుల కష్టాలను అర్థం చేసుకుంటారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపుమేరకు మూడు పంటలు పండే పొలాలను అమరావతి రైతులు ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎంతో కష్టపెట్టి, కొట్టి, కిరాయి రాజకీయ నాయకుల చేత, కిరాయి క్యాంపులను పెట్టించింది. అమరావతి లోనే అమరావతి వాసులే… ఇక్కడ మాకు రాజధాని వద్దు, మాకు విశాఖపట్నమే రాజధాని కావాలి అన్నట్లుగా చెప్పించారు.

కోర్టు పక్కనే ఉంటే మాకు చిరాకు ఉంది. మాకు కర్నూల్ లోనే కోర్టు, రాజధాని కావాలని ఎవరైనా అడగగలరా? అలా అడిగారంటే లో అందులో ఏమైనా అర్థం పర్థం ఉందా? అంటూ నిలదీశారు. రాజధాని ఫైల్స్ సినిమాలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలన్న వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదని తెలిసిందని విలేకరులు రఘురామకృష్ణం రాజు దృష్టికి తీసుకురాగా, వై వి సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్యలు చేసే సమయానికే సినిమా సెన్సార్ పూర్తి అయ్యిందన్నారు. లేకపోతే ఏదో ఒక పాత్ర కు పనికిమాలిన పేరు పెట్టి ఆస్తులన్నీ తెలంగాణకు ఇచ్చేసి, తిరిగి హైదరాబాదుకు వెళ్తామని చెప్పించి ఉండేవారన్నారు.

రాజధాని ఫైల్స్ సినిమాలో నేను కూడా నటించాల్సి ఉండే…

రాజధాని ఫైల్స్ సినిమాలో నేను కూడా నటించాల్సి ఉండగా, రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఈ సినిమాలో నటించలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ రాష్ట్రంలో నిర్వహించగా, నేను ఢిల్లీలో ఉండడం వల్ల సినిమా లో నటించలేకపోయానన్నారు.

అమరావతి ఫైల్స్ పేరుపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం తో, ఈ సినిమా పేరును రాజధాని ఫైల్స్ గా నామకరణం చేశారు. ఈ సినిమా బాలరిష్టాలన్నీ దాటుకొని థియేటర్లలో ప్రదర్శించాల్సిన సమయంలో, ఎన్నికలు వస్తున్నాయి… ఈ సినిమా వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చేలా ఉందని వైకాపా తరఫున ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడుకు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, బెయిల్ కాపీ జైలుకు ఎలా వెంటనే వెళ్లిందని కొంతమంది ప్రశ్నించారు.

గురువారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు న్యాయస్థానం స్టే ఇస్తే, 11 గంటలకే మ్యాట్ని షోను థియేటర్లలో ఎలా నిలిపి వేశారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సినిమా థియేటర్ల యజమానులు ఆర్డర్ కాపీ గురించి ప్రశ్నిస్తే, బెదిరింపులకు దిగారు. మల్టీప్లెక్స్ లలో సినిమా చూస్తుండడం కూడా ఆపివేశారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని చెప్పుకునే సింగల్ సింహం, రాజధాని ఫైల్స్ సినిమా ను చూసి బెదురు చూపులు చూస్తూ పరిగెత్తాల్సి వచ్చింది. మోహన్ రెడ్డి భయపడ్డారు. సినిమా నిర్మాత రవిశంకర్, జగన్మోహన్ రెడ్డిని భయపెట్టారు. ఎంతో ధైర్యంగా ఈ సినిమా నిర్మించిన ఆయన్ని అభినందించాల్సిందేనని అన్నారు.

సినిమాలో గొడ్డలి పాత్ర పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సినిమా కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం నుంచే మొదలైనప్పటికీ, దర్శకుడు ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో కొన్ని దృశ్యాలను రూపొందించారు. దీనితో ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. గడ్డంతో ఉన్న ఒక ఎంపీ పై ముఖ్యమంత్రి పాత్రదారి చేయి చేసుకున్నట్టు చూపెట్టారని ప్రశ్నించగా, బహుశా ఆయనకు కొట్టే అలవాటు ఉన్నట్లు ఉందన్నారు.

గత రెండేళ్ల ఎనిమిది నెలల క్రితం నేను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ముఖ్యమంత్రి నన్ను ఫినిష్ హిమ్ అన్నప్పటికీ, పోలీసు అధికారులు తమ రక్షణ కోసం నన్ను అంతమొందించలేదు. అది నాకు పునర్జన్మ, నా పునర్జన్మకు ఒక కారణం ఉంది. దాన్ని తీర్చేసుకుంటానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

వాళ్లు సినిమాలు తీయవచ్చుట… వారిపై మాత్రం సినిమాలు తీయవద్దట

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , నారా భువనేశ్వరి వంటి రియలిస్టిక్ పేర్లను తమ సినిమా లోని క్యారెక్టర్లకు పెట్టి చిత్రాన్ని వారు రూపొందిస్తే తప్పు లేదట… కానీ రాజధాని రైతుల కష్టాలను చూపెడుతూ సినిమాను రూపొందించవద్దని పేర్కొనడం ఇది ఎక్కడి న్యాయమని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

వారి దర్శక నిర్మాతలకు ప్రాథమిక హక్కులు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట. రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద డైరెక్టర్ ను పెట్టి వారు సినిమా తీసుకోవచ్చు… వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాని రూపొందించడమే తప్పు అన్నట్టు గా వ్యవహరించడం దారుణం. జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా యాత్ర 2 సినిమా విడుదల థియేటర్లలో బొక్క బోర్లా పడింది. థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే యాత్ర 2 సినిమాను ఆడించాల్సిందేనట. ఈ సినిమాకు ప్రైవసీ కోసం ప్రేమ జంటలు మాత్రమే వెళ్తున్నాయి. ఎవరు ఈ సినిమాకు వెళ్లడం లేదు. యాత్ర 2 అట్టర్ ప్లాప్ కంటే పెద్ద ప్లాప్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తిని జనం చూడొద్దని అనుకున్న తర్వాత ఎంత బిల్డప్ ఇచ్చిన ఎవరూ చూడరనడానికి యాత్ర 2 సినిమాయే ఒక నిదర్శనం. యాత్ర సినిమా లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధను చూపించారనే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి చూశారు . యాత్ర 2 జగన్మోహన్ రెడ్డి బయోపిక్ కావడంతో వరస్ట్ అనుకొని సినిమా థియేటర్ కు వెళ్లి చూడడమే మానివేశారు. వ్యూహాలు, శపథాలను రూపొందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం కామెడీగా వెళ్లి చూస్తారే కానీ ఎవరు ఆ చిత్రాలను సీరియస్ గా తీసుకోరని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వైకాపాకు ప్రచారం చేస్తే… వాలంటీర్ల సంగతి అధోగతే

వైకాపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వాలంటీర్ల పరిస్థితి అధోగతేనని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. వాలంటీర్లు మారాలని, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని అధిష్టించే పార్టీ నేతలు కూడా అభయం ఇస్తున్నారు. వెధవ పనులు చేసే వారిని రానున్న ప్రభుత్వంలో కచ్చితంగా తీసివేస్తారు. నిజాయితీగాఉండండి… ఎవరికి ఓటు వేయాలో మీకు ఏమిటి సంబంధం. మీ సేవలు మీరు చేసుకోండి. ఎవరికి ఓటు వేయాలో ఓటర్లు నిర్ణయించుకుంటారు.

ఎవరైతే వాలంటీర్లు ఫలానా వారికి ఓటు వేయమని చెప్పకుండా ఉంటారో, వారి పేర్లను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని రానున్న ప్రభుత్వంలో కొనసాగించడం జరుగుతుంది. వైకాపాకు ఓటు వేయండని, టిడిపికి ఓటు వేయ వద్దంటే, ఇక మీ ఉద్యోగాలు ఉండవు. అలాగని టిడిపి, జనసేనకు ఓటు వేయమని ప్రచారం చేయాలని ఎవరూ చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పారని, తాము జగన్ సైన్యమని భావించి ఎటువంటి పిచ్చి పనులు చేయవద్దని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

ప్రభుత్వ ఖర్చు 350 కోట్ల రూపాయ తో వాలంటీర్లకు వందనం పేరిట సేవా రత్న, సేవ వజ్రా వంటి అవార్డులను అందజేశారు. ఆ పని, ఈ పని అంటూ 800 కోట్ల రూపాయలను దోచారు. అందులో నుండి ఖర్చు చేసుకోవచ్చు కదా?, ప్రభుత్వ సొమ్ము ఇచ్చి వాలంటీర్లను పార్టీ తరఫున ప్రచారం చేయాలని చెప్పడం దారుణంగా ఉంది . ప్రస్తుతం అమల్లో ఉన్న స్కీములు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని, ఫ్యాను గుర్తుకే ఓటు వేయమని ప్రజలకు చెప్పాలంటూ వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది.

చంద్రముఖి చంద్రబాబు నాయుడు అబద్దాలనే చెబుతారని ఆయన మాటలు నమ్మవద్దని ప్రచారం చేయాలంటూ వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి కోరారు. ప్రజలకు ఇస్తున్న హామీలను వారు అమలు చేయలేరని, తాను మాత్రమే అమలు చేయగలనని చెప్పి మన పార్టీ తరఫున దగ్గరుండి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించాలని, మీరే నా సైన్యం అని సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం దారుణం. వాలంటీర్లకు ఇచ్చే సొమ్మేమో ప్రభుత్వానిదైతే, పార్టీ తరఫున ప్రచారం చేయాలనడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ సొమ్మును పార్టీ ప్రతినిధులు వాలంటీర్లకు పంచుతుంటే, గుడ్లప్పగించి చూడడమే మన పని అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, వాలంటీర్లు ఎన్నికల డ్యూటీలో ఏజెంట్లు గా ఉండడానికి కూడా వీలు లేదన్నారు.

వాలంటీర్లను కూడా చైతన్యం వచ్చినట్లు కనిపించింది. చాలామంది ఈ సభకు రాలేదు. వచ్చినవారు కూడా మధ్యలోనే నిష్క్రమించారు. దీనితో భవిష్యత్ ముఖచిత్రం జగన్మోహన్ రెడ్డికి కనిపించి ఉంటుంది. ఎటువంటి మొహమాటం లేకుండా మన పార్టీకే ఓటు వేయమని చెప్పండి అనడంలో నే ఆయన బేలతనం, భయాన్ని, దిక్కుతోచని పరిస్థితిని సూచిస్తోందన్నారు. 5000 రూపాయల కోసం పనిచేస్తున్న వాలంటీర్లకు ఎన్నికల్లో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం లభిస్తే, గురువును మించిన శిష్యుల్లా వాటిని నొక్కేయాలి. ఏదో తింగరి అవార్డులు ఇచ్చారని మురిసిపోవద్దు. పంచమని ఇచ్చింది ప్రజల సొమ్మేనని గుర్తుపెట్టుకోవాలన్నారు.

అన్నింటిలోనూ రాజ్ కసిరెడ్డి దే హవా

జగన్మోహన్ రెడ్డి తరఫున అక్రమ లావాదేవీలన్నింటి రాజ్ కసిరెడ్డి చక్కబెడుతున్నారనే గుసగుసలు ఆంధ్రాలో వినిపిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . యూని కార్పోరేట్ సర్వీస్ పేరిట రాజ్ కసిరెడ్డి చేస్తున్న నిర్వాకం అంతా ఇంత కాదు. రాజ్ కసిరెడ్డి ఆఫీస్, ఆడాన్ డిస్టలరీ కంపెనీ ఆఫీస్ ఒకే అడ్రస్ లో ఉన్నాయి. ఆడాన్ డిస్టలరీ అనేది పేపర్ పైన ఉన్న కంపెనీ మాత్రమే. ఇతరుల కంపెనీలను లీజుకు తీసుకొని బీభత్సమైన టర్నోవర్ ఆడాన్ డిస్టలరీ కలిగి ఉంది.

వెరైటీ పేర్లతో మధ్యాహ్నం సప్లై చేస్తూ, క్యాష్ లో అమ్మిన కలెక్షన్లను, మద్యం లేబుళ్లను దొంగ మద్యం లేబుళ్లను రాజ్ కసిరెడ్డి ముద్రిస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి సేవలో రాజ్ కసిరెడ్డి తరిస్తూ, కోటానుకోట్ల రూపాయల లావాదేవీలను చక్కబెడుతున్నారని పత్రికలు కోడై కూస్తున్నాయన్నారు.

నాలుగేళ్లుగా చెబుతున్నా… విననందుకే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశా

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులని వారిని పార్టీ పనికి వాడొద్దని, మద్యం రూపంలో కన్నాలు వేయడం మంచిది కాదని, మద్యం అధిక ధరలకు విక్రయించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవద్దని, వారి జేబులను గుల్ల చేయవద్దని రావణుడికి విభీషణుడి మాదిరిగా, ధృతరాష్ట్రుడికి విదురుడి మాదిరిగా చెప్పి చూశాను. ఎంతకు వినిపించుకోకపోతే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ( పిల్ ) దాఖలు చేశాను.

పిల్ వేసేటప్పుడు అండర్ టేకింగ్ ఇవ్వాలి. ఇచ్చాను. ఏదో ఒక ట్రెబ్యునల్ లో కంటెమ్ట్ ఉంటే, అండర్ టేకింగ్ లో ప్రస్తావించలేదని అడ్వకేట్ జనరల్ ఎత్తి చూపారు. కంటెమ్ట్ అనేది కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే ప్రత్యేక హక్కు. చిన్న కోర్టులకు, ట్రైబ్యునల్ కు ఈ హక్కు వర్తించదు. ఎన్ సి ఎల్ ఏ టి అడ్మినిస్ట్రేటివ్ ఐ వి సి కింద వచ్చిన ట్రైబ్యునల్. ఐ వి సి చట్టంలో కాంటెమ్ట్ ప్రొవిజన్ ఇవ్వలేదు. ఎందుకు కంటెమ్ట్ తీసుకోకూడదని ట్రైబ్యునల్ ప్రశ్నిస్తే… నేను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాను.

ట్రైబ్యునల్ కు ఆ ప్రత్యేక అధికారం ఉందా అని నేను ప్రశ్నించగా, మూడేళ్ల నుంచి ఆ కేసు పెండింగు లోనే ఉంది. తనపై ,2020 లో డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేశారని పిల్ కోసం ఇచ్చిన అండర్ టేకింగ్ లో ఎందుకు ప్రస్తావించలేదని అద్భుతమైన ఇంగ్లీషులో అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. అయితే, నాపై మా పార్టీ ఎంపీలు ఇచ్చిన డిస్ క్వాలిపికేషన్ పిటిషన్ పక్కన పడేశారు. ఒకసారి నన్ను పిలిచి అడిగితే నేను మా పార్టీకి వీర విధేయుడనని, పార్టీ అధ్యక్షుడిని కాదని… తాను కేవలం ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పాను.

నాపై వేసిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ గురించి ప్రస్తావించాలంటే, 100 మంది 100 రకాల పిటిషన్లు వేస్తారు వాటన్నింటి గురించి నాకేమిటి సంబంధం. వైకాపా సభ్యుడిగానే పార్లమెంట్ రిజిస్టార్ లో నా పేరు ఉంది. పార్టీ పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి సూచనల మేరకే, 428 వ నెంబర్ స్థానాన్ని కేటాయిస్తున్నట్లుగా పార్లమెంట్ సెక్రటేరియట్ తెలియజేసింది. గతంలో నాపై దేశద్రోహం కేసుతో పాటు ఇంకా అనేక కేసులను నమోదు చేశారు.

అక్రమంగా నిర్బంధించి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి దంపతులు చూశారన్న సమాచారం నాకు ఉంది. అయినా ఇవన్నీ నేను అండర్ టేకింగ్ లో ప్రస్తావించలేనూ కదా?!. 32 కేసుల్లో ఏ 1 నిందితుడుగా ఉన్న వ్యక్తి నాపై 18 అక్రమ కేసులను నమోదు చేయించారు . ఇందులో 153 A, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులనూ జగన్మోహన్ రెడ్డి పెట్టించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు .

జగన్మోహన్ రెడ్డి స్కాముల గురించే ప్రశ్నించాను

జగన్మోహన్ రెడ్డి చేసే స్కామ్ ల గురించి మాత్రమే తాను ప్రశ్నించానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సాక్షి పేపర్ అక్రమంగా అమ్ముకుంటున్న తీరును, భారతి సిమెంట్ ప్రభుత్వ గృహాలకు విక్రయిస్తున్న తీరు ను, లిక్కర్, ఇసుకలో దోచుకుంటున్న తీరును ప్రశ్నిస్తే, స్కీముల గురించి ప్రశ్నించాన నడం హాస్యాస్పదంగా ఉంది. నేను వైకాపా ఎంపీ ని కాదని, నా పైన ఉన్న కేసుల గురించి ప్రస్తావించలేదని అడ్వకేట్ జనరల్ అద్భుతమైన ఇంగ్లీషు ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు బాగానే ఉన్నప్పటికీ, పిల్ నిబంధనలన్నింటిని నేను కచ్చితంగా పాటించాను.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున కాకుండా అడ్వకేట్ జనరల్, ముఖ్యమంత్రి తరఫున వాదనలు వినిపిస్తూ… వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం సరికాదు. 32 కేసులు నమోదు చేస్తే 32 కేసుల్లో 420 గా పేర్కొనబడిన వ్యక్తికి సపోర్ట్ చేస్తూ, నా మీద అభియోగాలను మోపడం కరెక్ట్ కాదని రఘురామ కృష్ణంరాజు సూచించారు