మాయల పకీర్ ప్రాణం పక్షిలో.. జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో..

– అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోంది
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అమ‌రావ‌తి : ‘‘ మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు మాజీ సీఎం జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉంది. జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారు. కోర్టుకు కూడా వెళ్లడం లేద ’’ ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

జగన్ పై కేసుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అంతలోనే జగన్-షర్మిల ఆస్తుల రగడ తెరపైకి వచ్చింది. జగన్ కేసుల వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించాలి. దానితో అన్నాచెల్లెళ్ల ఆస్తుల పంచాయితీ కూడా తేలిపోతుంది అన్నారు.

ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, జాతీయ పార్టీలు బలహీనపడుతున్నాయని నారాయణ అన్నారు. అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విమర్శించడం సిగ్గుచేటని, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా మోదీ వ్యవహార శైలి ఉందని నారాయణ వ్యాఖ్యానించారు.