– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
మురికిపూడి, మహానాడు: అప్పులు, అక్రమాలు, ప్రజలకు తిప్పలు తప్ప మరో ఊసులేకుండా సాగిన వైసీపీ అయిదేళ్ల పాలనలో జగన్ చివరకు జల్ జీవన్ మిషన్ జీవం కూడా తీసేశారని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో రాష్ట్రానికి వెనకబడి ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు.
పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిలకలూరిపేట మండలం మురికిపూడిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.60 లక్షలతో పీడబ్ల్యూఎస్ పథకం పునరుద్ధరణ, మంచినీటి కుళాయిల ఏర్పాటు , రూ.60 లక్షలతో బైపాస్ రోడ్డు నిర్మాణం, రూ.15 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రాన్ని రూ. 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా పేదలకు మంచినీళ్లిచ్చే ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా విడుదల చేయలేక పోయారన్నారు.