Mahanaadu-Logo-PNG-Large

రివర్స్‌ టెండరింగ్‌తో జలయజ్ఞం…ధనయజ్ఞం

` సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డి
` సైకో పాలనలో ఎడారిగా మారిన రాష్ట్రం
` ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు
` ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడు
` సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టాడు
` చంద్రబాబు ఐదేళ్లలో రూ.68,293 కోట్లు ఖర్చు
` జగన్‌ ఐదేళ్లలో రూ.39,052 కోట్లు మాత్రమే..
` దేనికి ఖర్చు పెట్టారో లెక్కలు కూడా తెలియని వైనం
` జలయజ్ఞం పేరుతో రూ.20 వేల కోట్లను కొల్లగొట్టారు
`మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమామహే శ్వరరావు, బీజేపీ నాయకుడు పాకా సత్యనారాయణ, జనసేన నాయకుడు గౌతమ్‌ విలేఖరుల సమవేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టి పోలవరాన్ని నట్టేట ముంచి రాష్ట్రాన్ని జగన్‌ రెడ్డి ఎడారిగా మార్చారని మండిపడ్డారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో జలయజ్ఞాన్ని జగన్‌ ధనార్జనగా మార్చుకుని వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడు తూ రివర్స్‌ టెండర్‌ డ్రామాలతో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాడు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. నీరు ప్రగతిని, నీరు చెట్టు ప్రాజెక్టులు, చెరువులు, నదుల అనుసంధానంపై ఏ రోజు మాట్లడలేదు. నెల్లూరు సంగం బ్యారెజ్‌ 90 శాతం పనులు టీడీపీ పాలనలో పూర్తి అయితే 10 శాతం పనులు పూర్తి చేయడానికి ఐదేళ్లు పట్టింది. వంశధార నాగావళి అనుసంధానం చెస్తానని కబుర్లు చెప్పి దాన్ని గాలికి వదిలేశాడు. అవుకు టన్నెల్‌ పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకుంటానని మోసం చేశాడు. నాలుగేళ్లు పనులు చేయకుండా కుప్పంలో ఉత్తుత్తి గేట్లు పెట్టి నీళ్లు వదిలి 24 గంటలు కాకుండానే బ్రాంచ్‌ కెనాల్‌పై పెట్టిన గేట్లు తీసుకుపోయాడు.

నదుల అనుసంధానంతో హంద్రీనీవా, గాలేరునగరి, మచ్చుమర్రి, తెలుగుగంగ ప్రాజెక్టులను పూర్తి చేసి టీడీపీ హయంలో నీరు అందించాం. జగన్‌ రెడ్డి పక్క రాష్ట్రంతో కుమ్మక్కై రాయలసీమకు అందాల్సిన నీరు రాకుండా చేశాడు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.68,293 కోట్లు ఖర్చు పెట్టింది. జగన్‌రెడ్డి 39,052 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు గాలికొదిలేశారు. పోలవరం ఎడమ కాలువలో ఒక్క తట్ట మట్టి తీయలేదు. పురుషోత్తపట్నం డెల్లా రైతులను నట్టేట ముంచాడు. మహేంద్ర తనయను పట్టించుకోలేదు. వంశధారను నాశనం చేశాడని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చాం. జగన్‌ రెడ్డి ఇరిగేషన్‌కు కేటాయించిన 32 వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టాడో తెలియదు. టీడీపీ పాలనలో 4,735 చెరువులను అనుసంధానం చేశాం. 93,300 చెక్‌డ్యామ్‌లు కట్టాం. జగన్‌ పాలనలో ఒక్క చెక్‌డ్యామ్‌ కట్టలేదు. 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంట కుంటలు ఇలా ఎన్నో చర్యలు చేపట్టి రైతాంగ మేలు కోసం టీడీపీ కృష్టి చేసిందని, వైసీపీ రివర్స్‌ టెండర్‌లతో దోచుకుందని ధ్వజమెత్తారు.

రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి
రాయలసీమలో రూ.12,441 కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెడితే… వైసీపీ ఖర్చు పెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే. జగన్‌ రాయలసీమ ద్రోహి. హంద్రీనీవాకు రూ.4,182 కోట్లు టీడీపీ ఐదేళ్లలో ఖర్చు పెడితే జగన్‌ రెడ్డి ఖర్చు పెట్టింది రూ.515 కోట్లు మాత్రమే.రాయలసీమ రైతులకు చేసింది ఏమీ లేదు. రాయలసీమ లిఫ్ట్‌ ఏమైపోయిందో తెలియదు. రూ.2,144 కోట్లను పెద్దిరెడ్డి పీఎల్‌ఆర్‌ కంపెనీలకు దోచిపెట్టాడు తప్ప ఎక్కడా రాయలసీమ ప్రాజెక్టులను ఉద్దరించలేదని విమర్శించారు.

ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ రూ.1,531 కోట్లను ఖర్చు పెడితే వైసీపీ ఖర్చు రూ.453 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. చంద్రబాబు పట్టుదలతో పూర్తి చేసి తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వంశధారకు రూ.875 కోట్లు టీడీపీ ఖర్చు పెడితే వైసీపీ రూ.375 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ప్రాజెక్టులను గాలికొదిలేసి రూ. 24,827 కోట్ల అంచనాలు పెంచుకుని దోచుకున్నారే కానీ, ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. గండికోటలో నీరు ఉన్నా కొత్త ఆయకట్టుకు ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను టీడీపీ పరిగెత్తిస్తే వైసీపీ పక్కన పెట్టి పైసలు దండుకునే పందేరానికి పూనుకుంది. గాలేరునగరి, సుజల స్రవంతికి రూ. 2,394 కోట్లు ఖర్చు పెడితే జగన్‌ రెడ్డి ప్రభుత్వం కేవలం రూ.759 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని వివరించారు.

పులివెందులకు చేసింది లేదు..
పులివెందులను ఉద్ధరించానని చెబుతున్న జగన్‌ పులివెందుల రైతుల కోసం చేసింది ఏమిలేదు. టీడీపీ హయాంలో అవుకు టన్నెల్‌ను పూర్తి చేసి సాగునీరు అందించి రైతులను ఆదుకున్నాం. జగన్‌ రెడ్డి కుప్పంలో చేసిన డ్రామాలను రైతులే ఛీకొడుతున్నారు. గండికోట నిర్వాసితులకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా పోలీసు లతో దాడులు చేయించాడు.

పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతున్నా ఆపలేదు…
ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జలదీక్షలు చేసి దొంగ డ్రామాలు ఆడిన జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి శంకుస్థాపన చేసి వచ్చాడు. పక్క రాష్ట్రాల్లో అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా… అంతమంది ఎంపీలను పెట్టుకుని జగన్‌ రెడ్డి ఆపలేకపోయాడు. జగన్‌ రెడ్డి సొంత జిల్లాలో జే గ్యాంగ్‌ ఇసుక దందాలతో డ్యాములు కొట్టుకుపోయి 39 మంది చనిపోయారు. అయినా ఇంతవరకు వారికి ఎటువంటి సాయం చేయలేదు. ఆ డ్యాములను పట్టించుకోలేదు. పులిచింతల డ్యామ్‌ కొట్టుకుపోతే నాలుగేళ్లు గెేట్లు పెట్టలేదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారు.

పోలవరంను గోదాట్లో ముంచారు…
బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌ పోలవరంను గోదాట్లో ముంచారు. 2020లో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గాలికొదిలేశారు. నిర్వాసితులను మోసగించారు. పోలవరం పూర్తి అయ్యి ఉంటే శ్రీకాకుళం వరకు నీరు వెళ్లేవి. విద్యుత్‌ ఉత్పత్తి జరిగేది. పోలవరం పనులను పరిగెత్తించి టీడీపీ పాలనలో 72 శాతం పనులు పూర్తి చేశాం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వైసీపీ పక్కదారి పట్టించి నిర్వాసితులను నిండా మోసం చేశారు. ఉద్దేశ పూర్వకంగా గోదావరి వరదను పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పైకి మళ్లించి దాన్ని దెబ్బతీశారు. పోలవరం డ్యామ్‌ ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే ఇరిగేషన్‌ మంత్రి చేతులెత్తేశాడు. ఎక్కడైనా నీళ్లు ఇచ్చి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. జగన్‌ పనులు పూర్తి కాకుండా జాతికి అంకితం చేశామని చెప్పటం ఇంత విచిత్రం ఎక్కడా లేదు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ప్రాజె క్టులన్నీ కేంద్ర సహకారంతో పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తాం.

సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదు…
బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా జగన్‌ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. కొట్టుకు పోయిన గేట్లను కూడా పెట్టలేకపోయాడు. జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ప్రాజెక్టులు, సాగునీటి అవసరాలపై అసలు అవగాహన లేదు. అంచనాలు పెంచుకుని దోచుకోవడం మాత్రమే తెలుసు. గడిచిన ఐదేళ్లలో అదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. జగన్‌ రెడ్డికి మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుంది. ప్రజలు గమనించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జనసేన నాయకులు గౌతమ్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనలో పనిచేసిన ఇరిగేషన్‌ మంత్రులకు టీఎంసీ అంటే కూడా తెలియదు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టులను ముంచారు. బహుళార్థక ప్రాజెక్ట్‌ పోలవరాన్ని ఒక డ్యామ్‌గా మార్చే పనిగాపెట్టుకున్నాడు. రివర్స్‌ టెండర్‌ తో వెలుగొండ ప్రాజెక్ట్‌ వ్యయాన్ని 8 వేల కోట్లకు పెంచారు. ఖర్చు పెట్టింది 2 వేల కోట్లు అని చెబుతున్నారు. కానీ దానికి కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి అక్కడ ఉంది. జగన్‌ ప్రాజెక్టులకు 32 వేల కోట్లు ఖర్చు పెట్టాన ని బుకాయిస్తున్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. జలయజ్ఞం పేరుతో 20 కోట్లను మింగేశారని ఆరోపించారు.