ఏబీ వెంకటేశ్వరరావుకు జన చైతన్య వేదిక అభినందన

-వైకాపా వేధింపులకు ఎదురొడ్డి నిలిచారని ప్రశంస
-ప్రజల సమస్యల కోసం పనిచేయాలన్న లక్ష్మణరెడ్డి

విజయవాడ: గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వేధింపులకు కక్ష సాధింపులకు గురై రెండుసార్లు సస్పెన్షన్‌ను ఎదుర్కొని న్యాయపోరాటంలో విజయం సాధించి తిరిగి పోస్టింగ్‌ దక్కించుకుని పదవీ విరమణ చేసిన డీజీపీ కేడర్‌ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావును జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు. శనివారం విజయవాడలోని ఆయన స్వగృహానికి వెళ్లి శాలువా, పుష్ప మాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఆయన శేష జీవితం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఎలాంటి చార్జిషీట్‌ వేయకుండా, ఆధారాలు చూపకుండా నిజాయితీకి మారుపేరుగా ఉన్న నిబద్ధత గల ఏబీని సస్పెండ్‌ చేయడం కక్ష సాధింపునకు పరాకాష్ట అన్నారు. ఒకవైపు అవినీతిపరులను ప్రోత్సహిస్తూ..మరోవైపు నిజాయితీపరులను పాలనకు దూరంగా ఉంచటం వైకాపా పాలన నైజంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న పౌర సంస్థలను సమన్వయపరచి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కీలక భూమిక వహించాలని కోరారు.