జవహర్ రెడ్డి.. కింకర్తవ్యం ?

-ఏబీవీకి హైకోర్టులో ఊరట
– క్యాట్ ఆర్డర్ను సమర్ధించిన హైకోర్టు
– ఒక్కరోజులో రిటైరయ్యే ఏబీ సాక్షులను ఏం ప్రభావితం చేస్తారు?
– ఏబీ కేసులో జగన్ సర్కారుకు షాక్
– సీఎసు మళ్లీ దరఖాస్తు ఇచ్చిన ఏబీవీ
– సీఎస్ కోర్టులో మళ్లీ ఏబీ బంతి
– జగన్ వైపు ఉంటారా? ధర్మం వైపు నిలుస్తారా?
-కోర్టు చెప్పినా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వని అధికారిగా అపకీర్తి తెచ్చుకుంటారా ?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి మరోసారి ధర్మ- నైతిక పరీక్ష ఎదురయింది. ఆయన చిత్తశుద్ధి-పక్షపాతరహిత వైఖరికి ఏబీవీకి పోస్టింగ్ రూపంలో అగ్నిపరీక్ష ఎదురయింది. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా క్యాట్ ఇచ్చిన ఆర్డరును సవాల్ చేస్తూ, జగన్ సర్కారు హైకోర్టుకు వెళ్లింది. తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా ఏబీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఒకరోజులో రిటైరయ్యే అధికారి కేసును-సాక్షులను ఏవిధంగా ప్రభావితం చేస్తారని ప్రశ్నించింది. ఇది జగన్ సర్కారుకు మరో శరాఘాతమే.

దానితో ఏబీ మరోసారి సీఎస్ను కలిసి.. క్యాట్ తీర్పుతోపాటు, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందచేశారు. మరోరోజులో రిటైరవనున్న తనకు పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్ధించారు. అదే సమయంలో తీర్పు కాపీని ఈసీ సీఈఓకు అందించారు.

రిటైరయ్యే ఒకరోజు ముందురోజు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏబీ.. సీఎస్కు ఇచ్చిన దరఖాస్తుపై సీఎస్ జవహర్ రెడ్డి, ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో ఆయన తన విధినిర్వహణను చిత్తశుద్ధితో, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారా? లేక మళ్లీ యధాప్రకారంగా ఏబీ అంటేనే, పగతో రగిలిపోతున్న సీఎం జగన్ దివ్యసముఖానికి పంపి.. యధావిధిగా మళ్లీ సుప్రీంకోర్టులో అపీల్ చేయాలన్న ఆయన ఆదేశాన్ని అమలుచేస్తారా? అన్న చర్చ అధికారవర్గాల్లో జరుగుతోంది. మరో నెలల రిటైరయ్యే జవహర్రెడ్డి.. ఏబీ కేసును మానవతావాదంతో కాకుండా, చట్టాన్ని గౌరవించే అధికారిగా చూస్తారా? లేక సీఎం ఆదేశాల కోసం ఎదురుచూస్తారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే విశాఖ భూముల కుంభకోణంలో జవహర్రెడ్డి పాత్రపై, టీడీపీ-జనసేన-బీజేపీ ఆరోపణల వర్షం కురిపిస్తోంది. తనపై ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ కు లీగల్ నోటీసులు పంపినా, ఆయన లెక్కచేయడం లేదు. పైగా తాజాగా మరో ఆరోపణలను బయటపెట్టారు. జవహర్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన బినామీగా వ్యవహరించిన వ్యక్తుల పేర్లతోపాటు, విశాఖ బినామీ పేరు కూడా మూర్తియాదవ్ బయటపెట్టారు.

ఒకవేళ ప్రభుత్వం మారితే.. ఈ ఆరోపణలకు సంబంధించి, జవహర్రెడ్డి ఇబ్బందులు పడక తప్పదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత, విశాఖ భూముల ఆరోపణలపై విచారణ జరిపిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జవహర్రెడ్డి.. సీఎం జగన్కు ఇంకా విధేయత కొనసాగిస్తారా? లేక తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొత్త ప్రభుత్వానికి మరింత ఆగ్రహం రాకుండా ఏబీకి పోస్టింగ్ ఇచ్చి, నష్టనివారణతో దిద్దుబాటుకు దిగుతారా? అన్న అంశంపై అధికార రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.