ఈ నెల 14 న కోవూరు యువతకు జాబ్ మేళా

– జాబ్ మేళాలో 32 కంపెనీలు పాల్గొంటాయి
– 10 నుంచి ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, ఫార్మసీ, పీజీ దాకా అర్హులే
– రిక్రూట్ అయ్యే యువకులకు 1.65 లక్షల నుంచి 5.7 లక్షల వార్షిక వేతనం
– జాబ్ మేళాలో టెక్ మహేంద్ర, అమర్ రాజ, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్, రిలియన్స్, అపోలో ప్రతినిధులు
– కోవూరు నియోజకవర్గ యువకులకు తొలి ప్రాధాన్యత
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు: యువతకు ఉపాధి కల్పిస్తామన్న ఎన్నికల హామీల అమలులో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 14 న (శనివారం) కనుపర్తిపాడు లోని విపిఆర్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళా కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

టెక్ మహేంద్ర, అమర్ రాజ, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్, రిలియన్స్, అపోలో, హెటెరో డ్రగ్స్, పేటిఎం లాంటి 32 పారిశ్రామిక, ఫార్మా, సాఫ్ట్ వేర్ సంస్థల ప్రతినిధులు ఈ జాబ్ మేళా ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో అందుతున్నాయన్నారు.

10వ తరగతి మొదలు ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, ఫార్మసీ, పీజీ చదివిన వారు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపిక అయ్యే అభ్యర్థుల విద్యార్హతను బట్టి సంవత్సరానికి 1.65 లక్షల నుంచి 5.7 లక్షల వార్షిక వేతనం లభించే అవకాశముందన్నారు.