Mahanaadu-Logo-PNG-Large

మల్టినేషనల్‌ కంపెనీలలో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

-ఈ విద్యా సంవత్సరంలోనే 12,000 మందికి అవకాశాలు
-జాబ్‌ మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా సిలబస్‌ మార్పులు
-విశాఖలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి

విశాఖపట్నం: ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయవచ్చని, అందుకు అయా సంస్థలే అవకాశాలు కల్పిస్తున్నాయని సాంకతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులు అందివచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాలిటెక్నక్‌లలో గత మూడురోజులుగా నిర్వహిస్తున్న జాబ్‌ అచీవర్స్‌ డే కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి.

విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగరాణి మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారి లో 12,000 మంది వివిధ ప్రముఖ సంస్థలలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు సాధించారన్నారు. అనేక మంది రూ.8 లక్షల వార్షిక వేతనం అందుకున్నారని, సగటు ప్యాకేజీ కూడా రూ.3 లక్షలు ఉందని అన్నారు. సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి విభాగం ఈ విషయంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిందన్నారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించటమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ డైరెక్టర్‌ జి.వి.ఎన్‌. ప్రసాద్‌, ఒడిన్‌ కంట్రోల్‌ ఎండీ ఎస్‌.నందగోపాల్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం గణపతి, సాంకేతిక విద్యాశాఖ ఉపసంచాలకులు డాక్టర్‌ ఎం.ఎ.వి.రామకృష్ణ, సాంకేతిక విద్య శిక్షణ మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ జానకిరామయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ కె.నారాయణరావు, టీపీవో హరిబాబు పాల్గొన్నారు.