27న జాషువా కవితా పురస్కారం ప్రదానోత్సవ సభ

గుంటూరు, మహానాడు: నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 129వ జయంతి సభను జయప్రదం చేయాలని శాసన మండలి సభ్యుడు కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. 2/7 బ్రాడిపేటలోని గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రచార పోస్టర్‌ని అవిష్కరించారు. ఈ సందర్బంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 27న జాషువా 129వ జయంతి సభ జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని, సభలో శాసన మండలి మాజీ సభ్యుడు ఎంవీఎస్‌ శర్మ, వి.బాలసుబ్రమణ్యం, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగారు మోహన్‌ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఈ సందర్బంగా 2024 జాషువా సాహీతీ పురస్కారాన్ని ప్రముఖ అభ్యుదయ కవి, సాహితీ వేత్త, ఆచార్య గుమ్మా సాంబశివరావు, ప్రముఖ సాహితీ వేత్త, ‘‘పాడుదమా స్వేచ్ఛా గీతం’’ అనే గీతాన్ని రాసిన గంటేడ గౌరునాయుడులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. సభలో కవులు, కళాకారులు, సాహితీ ప్రియులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ గుఱ్ఱం జాషువా ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో జన్మించడం గర్వకారణమని, జాషువా నేటి సమాజంలోని రుగ్మతులకు వ్యతిరేకంగా పోరాడారని, కుల, మత, ప్రాంతీయతత్వాలకు వ్యతిరేకంగా, కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా తన సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యం చేశారని, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన కలాన్ని గళాన్ని ఎక్కుపెట్టారని తెలిపారు. నేటి ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజలోకి తీసుకవెళ్ళాలని కోరారు. జాషువా తన నిజజీవితంలో అంటరానితనాన్ని, కుల వివక్షతను ఎదుర్కోన్నారని, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ సర్వ మానవ సమానత్వాన్ని బోధించారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈమని అప్పారావు, కిరణ్‌, వై.కృష్ణకాంత్‌, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.