కాకాణి అండ్ బ్యాచ్… ఆ ఇళ్ళ సంగతేంటి?

– పేదల ఇళ్ళ పేరిట బొక్కిన ప్రతి రూపాయి కక్కిస్తాం..
– శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం

సర్వేపల్లి, మహానాడు: పేదల ఇళ్ళ నిర్మాణాల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని, జగనన్న కాలనీలు అన్నారు సరే…..ఇళ్లలోకి పోవడానికి ప్రజలకు ఈత నేర్పించాలి కదా అని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన వెంకటాచలంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ళు నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా మీడియాతో ఏమన్నారంటే..

ఒక మోస్తారు వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు ఎక్కువైతే ఎలా ఉంటుందో.. కాలనీల పేరుతో కోట్లు గడించిన కాకాణి అండ్ బ్యాచ్ ఒక్కసారి ఈ ఇళ్ల మరుగుదొడ్డిలోకి వెళ్ళగలరా? పేదల ఇళ్ళ పేరుతో మెక్కిన వారి నుంచి ప్రతి రూపాయి కక్కిస్తాం.. ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదు.

అత్యంత నాసిరకంగా కట్టిన ఇళ్ల దుస్థితిని చూసి ఆవేదన కలుగుతోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాటు నిర్దేశిత ప్రమాణాల కంటే అత్యంత దారుణంగా నిర్మాణాలు ఉన్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు అత్యంత నాసిరకంగా ఇళ్ళు నిర్మించారు. శ్లాబులో మందం తగ్గిపోయింది…స్టీల్ రాడ్ల ఏర్పాటులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇంటి నిర్మాణంలో కీలకమైన పునాదుల నిర్మాణంలోనూ అంతా మోసమే. పార్టీషియన్ వాల్ నిర్మాణంలోనూ వెడల్పు తగ్గించేశారు.

కాలనీల పేరుతో కోట్లు గడించిన కాకాణి అండ్ బ్యాచ్!

పేదలంటే అంత అలుసా…ఇంత దారుణమైన వ్యక్తులను ఎప్పుడూ చూడలేదు. ఒక్క ఈ కాలనీలోనే రూ.20.50 లక్షలతో మట్టి తోలినట్టు బిల్లులు చేసుకున్నారు. ఒక్కో లబ్ధిదారుడి వద్ద ఇంటికి రూ.40 వేల వరకు అదనంగా గుంజుకున్నారు. చివరకు మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడ్డారు. నాలుగైదు అడుగుల ఎత్తులోనే మరుగుదొడ్డి నిర్మించడం దుర్మార్గం. ఇళ్ళ నిర్మాణంలో జరిగిన అవినీతిని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్ళాను. సీఎం చంద్రబాబు నాయుడి ఆదేశాలతో ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ అక్రమాల మీద స్పందించి పేదల ఇళ్ళ పేరుతో దోచుకున్న కోట్ల రూపాయలను అక్రమార్కుల నుంచి కక్కించి వారిని జైలులో పెట్టాలి.