కాకాణి వారి శాశ్వత భూ కబ్జా పథకం!

సర్వేపల్లి నియోజకవర్గంలో వెలుగుచూస్తున్న దందాలు
భూ హక్కు అంటూ తక్కువ ధరకే లాక్కొనే యత్నం
తాజాగా ఓ రైతుకు ఆయన అల్లుడి దళారీ కాల్‌ రికార్డ్‌
వైసీపీలోకి రాకుంటే నిషేధిత జాబితాలో పెడతామని హెచ్చరికలు
రూ.11 కోట్ల భూమి రూ.2 కోట్లకే సొంతం చేసుకునే ప్రయత్నం
రామదాసుకండ్రిగలోనూ ఏపీఐఐసీ ద్వారా బినామీ కంపెనీ పేరుతో
రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కాకాణి అల్లుడు
పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తామని బ్లాక్‌ మెయిలింగ్‌
కాల్‌ రికార్డ్‌ బయటపెట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
జూన్‌ 4 వరకు కొనుగోళ్లు, అమ్మకాలు నిషేధించాలని వినతి
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి

నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్‌రెడ్డి బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పేదలకు శాశ్వత భూ హక్కు అంటూ వారి భూమిని తక్కువ ధరకే లాగేసుకునే ప్రయత్నాలు వెలుగుచూస్తున్నాయి. కాకాణి అల్లుడికి సంబంధించిన ఓ దళారి రైతులను బెదిరించిన కాల్‌ రికార్డును బుధవారం నెల్లూరు టీడీపీ కార్యాల యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి బయటపెట్టారు. భూ కబ్జాల వివరాలను సమావేశంలో వెల్లడిరచారు.

శాశ్వత భూ హక్కు అంటూ పేదల భూముల స్వాహా

సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలకు 7 వేల ఎకరాల భూములను పంచానని కాకాణి గొప్పలు చెబుతున్న ఆయన గ్రామాల వారీగా లబ్ధిదారులు, భూవిస్తీర్ణం వివరాలను సచివాలయంలో డిస్‌ ప్లే చేయమంటే మాత్రం పలకరు. ఆర్టీఐ ద్వారా కోరితే కలెక్టరేట్‌ అధికారులు మాత్రం 3,300 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామంటున్నారు. పేదలకు శాశ్వత భూహక్కు కల్పిస్తున్నామని పైకి చెబుతూ వారి దగ్గర ముందుగానే బలవంతంగా సంతకాలు చేయించుకుని తక్కువ ధరకే లాగేసుకుంటున్నారు. మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు వద్ద జాతీ య రహదారి పక్కనే 16 ఎకరాల భూమి ఉంది. ఎకరా రూ.70 లక్షలు నుంచి రూ.80 లక్షలు విలువచేసే భూమి అది. ఆ భూమికి సంబంధించిన వారు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరగానే కాకాణి అల్లుడి తరఫు మీడియేటర్‌ నుంచి బ్లాక్‌ మెయిల్‌ కాల్స్‌ వచ్చాయి. టీడీపీ నుంచి బయటకు రాకపోతే ఆ భూములను నిషేధిత జాబితాలో పెడతామని బెదిరిస్తున్నారు. సుమారు రూ.11.20 కోట్ల విలువైన ఆ 16 ఎకరాల భూములను రూ.2.20 కోట్లకు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పేదలకు సంబంధించిన ఈ 16 ఎకరాల భూమి ద్వారా మంత్రి అల్లుడు రూ.9 కోట్లు ఆదాయం పొందే ప్రయత్నాల్లో ఉన్నాడు. జగన్‌ మోహన్‌రెడ్డి చెబుతున్న పేదలకు శాశ్వత భూహక్కు చట్టం పరిస్థితి ఇది. 20 ఏళ్లకు పైగా అనుభవం లో ఉన్న వారికి ఆ భూములపై పూర్తి హక్కులు వస్తాయని చెబుతూ వైసీపీ నేతలు ఇలా లాగేసుకుంటున్నారు.

వెంకటాచలం మండల పరిధిలోని రామదాసుకండ్రిగలోనూ ఇదే పరిస్థితి

సర్వే నంబరు 2194, 2195లో సుమారు 108 ఎకరాలు పైగా భూమి ఉంది. 2018-19లోనే ఇక్కడ నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ మార్కెట్‌ వాల్యూ ఎకరా రూ.36 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో ఆ విలువను రూ.48.40 లక్షలకు పెంచింది. చెన్నై కోల్‌ కతా హైవే, కృష్ణపట్నం పోర్డు రోడ్డులకు మధ్యలో ఉన్న ఈ భూములు బహిరంగ మార్కెట్‌ లో ఎకరా రూ.కోటి నుంచి రూ.1.20 కోట్లు పలుకుతున్నాయ్‌. అల్లుడి కోసం ఈ భూములకు సంబంధించిన 108 మంది హక్కుదారులైన రైతులను కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పిలిపించి బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఎకరాకు సుమారు రూ.16 లక్షలు చెల్లిస్తామని, తాము సూచించిన కంపెనీ(అల్లుడి బినామీ) పేరుతో రాయాలని బెదిరించారు. వ్యతి రేకిస్తే హక్కులు లేకుండా చేస్తామని బెదిరించి హైవేకు ఫేసింగ్‌ ఉండే 56 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించేసుకున్నారు. ఎకరాకు రూ.1.20 కోట్లు ఎక్కడ? రూ.16 లక్షలు ఎక్కడ? ఒక్కో ఎకరాకు రైతులు కోల్పోయింది అక్షరాలా కోటి రూపాయలు. 56 ఎకరాల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కంపెనీకి ఏమైనా అను భవం ఉందా ..అంటే అదీ లేదు..కేవలం ఒక కాంట్రాక్టు కంపెనీ. కాకాణి గోవర్ధన్‌రెడ్డి అల్లుడికి సంబంధించిన బినామీ కంపెనీ మాత్రమే.

ఎన్నికల సమయంలో కాకాణి ఆయుధం ఇదే

రెవెన్యూ చట్టాల పేరు చెప్పి కాకాణి రైతులను బెదిరిస్తున్నాడు. గతంలో పేదలకు పంపి ణీ చేసిన ఇళ్ల స్థలాలను కూడా కొత్తగా తెచ్చిన చట్టం ద్వారా కాజేసే కుట్రలో వైసీపీ నేతలు ఉన్నారు. పేదల అనుభవంలో పదేళ్లకు పైగా ఉన్న స్థలాలు, ఇళ్లను అమ్ముకోవ చ్చని చట్టం తెచ్చి ఆ పట్టాలను తమ ఇళ్లలో పెట్టుకున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీలో ఆ పట్టాల పేరుతో పేదలను బెదిరిస్తున్నారు. టీడీపీలో చేరితే పట్టాలు ఇవ్వబోమని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతున్నా రు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం దురదృష్టకరం. రెవెన్యూ భూములతో పాటు ఆ భూముల్లోని ఖనిజ సంపదను కాపాడటంపైనా అధికారుల్లో చిత్తశుద్ధి కరువైంది.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: సోమిరెడ్డి

ఈ దారుణాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు, భూముల పట్టాల విషయంలో జూన్‌ 4 వరకు కొనుగోళ్లు, అగ్రిమెంట్లు జరగనీయకుండా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదుగురు తహసీల్దార్లను ఆదేశించమని కలెక్టర్‌ను కోరుతున్నా. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే ఇద్దరు తహసీల్దార్లు సస్పెండ్‌ కావడం, ఐదుగురు వ్యక్తుల భూకుంభకోణాల్లో జైలుకు వెళ్లడం, లోకాయుక్తలో పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని, 7 వేల ఎకరాల భూపంపిణీ వెనుక ఉన్న గుట్టును బయటపెట్టాలని సూచిస్తున్నా. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో భూదోపిడీ దారులకు, బ్లాక్‌ మెయిలర్లకు బయపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలకు అండగా నిలుస్తామన్నారు. రామదాసుకండ్రిగలో జరిగిన బలవంతపు రిజిస్ట్రేషన్లను రద్దు చేయిస్తాం. శాశ్వత భూహక్కు చట్టం ద్వారా నాలుగు దశాబ్దాలుగా భూఅనుభవంలో ఉన్న రైతులకు హక్కులు కల్పిస్తామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన భూకుంభకోణాలపై ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.