భారీ అంచనాల మధ్య మరో రెండు రోజుల్లో `కల్కి 2898 ఏడీ` చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. దానికి తోడు… ప్రమోషన్ కంటెంట్‌తో చిత్రబృందం ఆ అంచనాల్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తోంది. తాజాగా `థీమ్ ఆఫ్ కల్కి` లిరికల్ డియోని విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ స్వర పరచిన ఈ గీతాన్ని కాలభైరవ రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆలపించారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ తన అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. `కల్కి 2898 ఏడీ` చిత్ర సారాంశం, పాత్రల తాలుకూ నేపథ్యం, వాటి సంఘర్షణ ఇవన్నీ… చంద్రబోస్ తన సాహిత్యంలో పొందుపరిచిన విధానం శ్రోతలను అబ్బుర పరుస్తోంది. ఇటీవల ఈ పాటని మధురలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణుడి జన్మ స్థలంలో ఈ పాట ని పరిచయం చేయడం, ఈ పాటలో కృష్ణుడి శక్తియుక్తుల్ని అక్షరాలలో మలచడం కాకతాళియం కాదు. ప్రముఖ నటి, నర్తకి శోభనా చంద్రకుమార్ ఈ పాట కోసం గజ్జె కట్టడం వీక్షకులకు మరింత హాయిని కలిగించింది. ఆ దృశ్యం కనుల పండుగలా కనిపించింది.
నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈనెల 27న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.