చికాగో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరార య్యారు. పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావాల్సిన ప్రతినిధుల ఓట్లను కమలా సాధించినట్లు ఆ పార్టీ నేషనల్ కమిటీ ఛైర్మన్ జేమ్ హారిసన్ ప్రకటించారు.
దీంతో నవంబర్ 7న జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తో పోటీ పడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీచేయనున్న ఇతర దేశ మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు.
అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల ఓటింగ్ గురువారమే ప్రారం భమైంది. ఓటింగ్ సోమవారం వరకు కొనసాగనుండగా.. ఇప్పటికే అభ్యర్థిత్వానికి కావాల్సిన 2 వేల 350 ఓట్లు సాధించారు .
దీంతో ఆమెను అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించారు జేమ్ హారిసన్. చికాగోలో ఈనెల చివరాఖరున జరగనున్న కన్వెన్షన్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతుగా ర్యాలీ చేయనున్నట్టు తెలిపారు.
కమలా హారిస్ అధికార నామినేషన్ ఆగస్టు 7తో ఖరారు కానుంది. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్ష న్లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్‌ను స్వీకరిస్తారు. అదే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.