Mahanaadu-Logo-PNG-Large

కలకలం రేపుతున్న కందిపప్పు కుంభకోణం… మంత్రి ఆకస్మిక తనిఖీల్లో బైటపడ్డ స్కాం

-పౌరసరఫరాల సరుకుల పంపిణీలో గోల్ మాల్
-కోట్ల కుంభకోణం
-నూతన మంత్రి తనిఖీలలో స్కామ్ బట్టబయలు
-ఈ కుంభకోణంలో పల్నాడు జిల్లా వినుకొండ దాల్ మిల్లర్ ల లింకులు
-వెలుగు చూస్తున్న అనేక అవకతవకలు
(వాసిరెడ్డి రవిచంద్ర)

ఏపీకి సరఫరా చేసే ప్రజా పంపిణీ కందిపప్పు సరఫరాలో భారీ కుంభకోణాలు జరిగినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన ప్రకటన చేశారు. ఆయన చేసిన ఆకస్మిక తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.అలాగే కందిపప్పు కాటాలలో తేడాలు, నాణ్యతలేని సరుకులు మంత్రి కంటపడ్డాయి. దీనిపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా లేబుళ్లను పరిశీలించగా సరుకులు సరఫరా చేసిన వినుకొండ డాల్ మిల్లులతో లింకు బైట పడింది. తీరా ఆ లింకులను తరచి చూస్తే డొంకoతా కదిలింది.

రాష్ట్ర మొత్తం సరఫరా చేసే కందిపప్పును విశాఖపట్నం, విజయవాడకు చెందిన ప్రముఖ డాల్ మిల్లర్లకు బినామీలు సరఫరా చేస్తుండగా, వారికి సబ్ కాంట్రాక్టర్లు గా వినుకొండ కు చెందిన ఒక ప్రముఖ దాల్ మిల్లర్ హస్తము ఉన్నట్లు వెలుగు చూసింది. మంత్రి తనిఖీలలో వినుకొండకు చెందిన వీరాంజనేయ డాల్ మిల్ పాత్ర ఉన్న విషయం బయటపడింది. దీనిపై ఉప్పందిన ఒక ఛానల్ వారు వినుకొండ డాల్ మిల్లు చేసే చీకటి వ్యాపారంపై ఆరా తీసేందుకు వెళ్లగా మిగతా డాల్ మిల్లర్లు అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే ప్రధాన పాత్రదారి వినుకొండ కు చెందిన వైసీపీ కనుసనల్లో ఉన్న ఒక ప్రముఖ డాల్ మిల్లరనే విషయం వెలుగు చూసింది. అతనికి వినుకొండ శాసనసభ్యుడుగా ఇటీవలి వరకు ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహకారంతో పాటు గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ అనుచరుడు అయిన ఒక యువనేత అండదండలు ఉన్నాయని, దీంతో వినుకొండ చెందిన ఈ ప్రముఖ డాల్ మిల్లర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని గుట్టంతా బైట పడింది. వీరంతా దొంగలెక్కలు చూపి పౌరసరఫరాల ప్రజా పంపిణీ వ్యవస్థలో సప్లై చేసిన కందిపప్పులో పప్పు అనేదే లేకుండా మింగేశారని,కోట్ల రూపాయలు కాజేశారనే విషయాలు వెలుగు చూశాయి.

దీంతో ఈ భారీ కుంభకోణంపై నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అసలు ఎవరెవరు పౌరసరఫరాల శాఖకు సరుకులు సరఫరా చేస్తున్నారు?ఆ ఏజెన్సీల పేర్లు ఏమిటి? ఎప్పటినుండి ఈ అవకతవకలు చేస్తున్నారు? నాణ్యత లేని సరుకులను ఎప్పటినుండి సరఫరా చేస్తున్నారో అధికారులు వెంటనే తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఈ అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులంతా ఉలిక్కిపడుతున్నారు. మరోవైపు ఈ అక్రమాలకు వినుకొండతో లింకు ఉండడంపై మరోసారి వినుకొండలో దాల్ మిల్లుల అక్రమాల దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతుంది. వినుకొండ దాల్ మిల్లర్లపై ఇప్పటికే విజిలెన్స్ కూడా నిఘా వేసినట్లు సమాచారం. దీనికి బాధ్యులు ఎవరనేది ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ కుంభకోణంలో అధికారుల చేతివాటం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి ఆదేశాలతో ఈ కోట్ల కుంభకోణంపై విచారణ జరిపితే చేతివాటానికి పాల్పడ్డ అధికారులు బలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి తీగలాగితే డొంక కదిలిన విధంగా కందిపప్పుతో మొదలైన అవినీతి కథ శనగలతోనూ కొనసాగిన చందంగా తవ్వితే మరిన్ని అక్రమాలు పౌరసరఫరాల శాఖలో వెలుగు లోనికి వస్తాయని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అందువల్ల అసలు ఈ ప్రజాపంపిణీ వ్యవస్థ ను ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు.