( చాడ శాస్త్రి)
భార్య బాధ్యత లేదు..
పిల్లలు లేరు..
కుటుంబ బాధ్యతలు లేవు… పోగేసుకోవాలి అనే యావ లేదు..తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు.
ఉన్నది ఒకటే కోరిక..ఒకటే ధ్యాస…
నా భారత్ ని విశ్వగురువు ఎలా చేయాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా…
ఎన్ని విమర్శలు వచ్చినా…ఎన్ని తిట్లు తింటున్నా… ఉన్న సమయం అంతా, జీవితం అంతా దేశానికి అంకితం. ఇది కదూ నిస్వార్థ దేశభక్తి…ఇది కాదూ దేశానికి తనువు అర్పించడం అంటే?!
ఏ శతాబ్దాలకో ఒకరు పుడతారు.ఆ సమయంలో మనం ఉండటం మన అదృష్టం. గుర్తించలేని వారి దురదృష్టం. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుండి రాజయోగమే. మన వంటి వారు గుర్తించడంలో ఆలస్యం.
నేను 20 సం. ల క్రిందట ఈ వ్యక్తి గురించి పూర్తిగా అధ్యయనం చేసి అతని గొప్పతనం గుర్తించాను. ఎందుకు ఇతని గురించి అధ్యయనం చేయవలసి వచ్చింది అంటే.. బహుశా అది 2000 సం. లో అనుకుంటా. విశాఖపట్టణంలో ఎక్కిరాల కృష్ణ మాచారి గారి ఆధ్యాత్మిక పత్రిక “మిహిర” నూతన సం. ఫలాలు రాస్తూ… రాబోయే దశాబ్దాల లో భారత్ విశ్వ గురువు అవుతుంది అంటూ రాసింది.
అంతే కాదు, దేశానికి పెద్దగా పరిచయం లేని, పశ్చిమానికి చెందిన, వివేకానంద పేరు స్ఫురించేలా ఒక వ్యక్తి అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లో కి వస్తాడు, అతను దేశ అత్యున్నత పదవి అలంకరిస్తాడు, కనీసం 10 సం. లు పదవిలో ఉంటాడు. అతను పదవి లోంచి దిగే సమయానికి ,భారత్ ని ప్రపంచం విశ్వ గురువుగా గుర్తిస్తుంది అని రాశారు.
అప్పట్లో అటువంటి వ్యక్తి కోసం చూస్తే నాకు నరేంద్రుడు లో ఆ చెప్పిన లక్షణాలు పూర్తిగా ఉన్నాయి అని కనిపించింది. అందుకే అప్పటి నుండి మోదీ గురించి అంటే, ఆయన వ్యక్తిత్వం, ఆయన కుటుంబ నేపధ్యం, ఆర్ఎస్ఎస్ లో ఆయన ఎదుగుదల ఇలా చాలా విషయాలు మీద నేను మోదీ గురించి తెలుసుకున్నాను. అప్పుడే తెలిసింది నాకు ఇతను ఒక పని రాక్షసుడు, ఒకే లక్ష్యం తో, చిత్త శుద్ది తో పనులు మొదలు పెట్టి ఇచ్చిన బాధ్యత పూర్తి చేస్తాడు అని.
ఆ తర్వాత కాలంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కావడం, అయిన కొద్ది రోజుల్లోనే భయంకరమైన భూకంపం కచ్ ప్రాంతంలో వచ్చి సర్వ నాశనం అవ్వడం జరిగింది. దాని పునరుద్ధరణ పనులు ఒక వైపు చేస్తూ ఉండగానే, 2002 గోద్రా అల్లర్లు, ఆయన మీద ముప్పేట దాడులు, న్యాయస్థానంలో వ్యాజ్యాలు . ఒక వైపు వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఎవరూ ఊహించన వేగంగా గొప్పగా కచ్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు.
విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారు. స్త్రీలోలుడైన చిచి నెహ్రూ సమయం లో మొదలు అయ్యి, దశాబ్దాలుగా సాగుతున్న మరియు మేధా పాట్కర్ వంటి వారిని ఎదుర్కొంటూ నర్మదా ఆనకట్ట నిర్మాణ పనులు వేగవంతం చేసారు.
మోదీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి, నేను ఆయన కార్యకలాపాలు గమనించడం ఇంకా ఎక్కువ అయింది. 2014 నుండి మరీ ఎక్కువ అయింది. ఒక రాజకీయ నాయకుడిని ఇంతలా అభిమానించి, నా సమయం ఖర్చు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన్ను అంతగా అభిమానించి ఆయనకు మద్దతు ఇవ్వడానికి, నా సమయం వెచ్చిస్తున్నందుకు ఏ నాడూ నేను బాధపడే పరిస్థితి ఈ 24 సం.లలో కలగ లేదు. నా అంచనా తప్పు కాలేదు.
‘ఖలేజా’ చలనచిత్రంలో ఒక సంభాషణ ఉంటుంది.
“అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు.జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు” అని. మోదీ విషయం లో ఇదే నా అభిప్రాయం.
అప్పుడు ఆ జ్యోతిష్యులు చెప్పిన విధంగా, మోదీ ప్రధాన పదవి అలంకరించడం, ఆ పదవిలో 10సం.లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది.
కానీ, తరువాత ఏంటి? అని ఒక ప్రశ్న నా మెదడులో ఉంటే నిన్ననే ఒక విషయం తెలిసింది.
ఒక జ్యోతిష్యులు మోదికి జగదాంబ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పారు. ఆయనే 2014లో, 2019లో కూడా మోడీకి సుమారు 300 సీట్లు వస్తాయి అని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు అని చెప్పారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏం చెప్పారు అంటే… 2001లో శని వృషభరాశి ని దాటినప్పుడు, మోదీజీ రాజకీయ శక్తి ప్రయాణం ప్రారంభమైంది అని, శని మహరాజ్ తన స్వంత 30 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేసుకుని, వృషభానికి ఎప్పుడు తిరిగి వస్తాడో అప్పుడు మోదీ పదవి త్యజిస్తారు అని చెప్పారు. శని వృషభంలో సంచరించడం, రాజకీయ శక్తిలో మార్పుకు ప్రసిద్ధి చెందిందిగా చెప్ప బడుతుందట.
ఆయన లెక్క ప్రకారం మోదీ రాజకీయ ప్రయాణం
07.10.2001లో ప్రారంభం అయింది. అక్కడ నుండి 30 సం. లు అంటే 2031 వరకు ఆయనే పదవిలో ఉంటారు. జగదాంబ ఆదేశానుసారం బహుశా అక్టోబర్ 2030 నుండి జూన్ 2031 కాలంలో ఆయన పదవి వదిలేస్తారు అని చెప్పారు. కొందరు జ్యోతిష్యుల ప్రకారం 2026-27 మధ్య ప్రధాన పదవి నుండి తొలగి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని చెబుతున్నారు. చూడాలి..ఎవరి జ్యోతిష్యం నిజం అవుతుందో.
74 సం. లు నిండి 75లో అడుగుపెడుతున్న దామోదర్ దాస్ నరేంద్ర మోదీ కి, ఆ జగదాంబ ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి. చివరి వరకు ఆయురారోగ్యాలతో భరత మాత సేవలో తరించాలి.