వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం

– గణపతి పూజ, గోపూజ నిర్వహించిన వేమిరెడ్డి దంపతులు
– ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామాలయం, త్రయంబకేష్వర్‌ జ్యోతిర్లింగం
– ముచ్చటగొల్పుతున్న 20 అడుగుల శివ రూపం
– మైదానమంతా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు
– వర్షాన్ని సైతం తట్టుకునేలా భారీ షెడ్ల నిర్మాణం
– భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని వసతుల కల్పన

జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని విఆర్‌సి మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం శివ నామస్మరణల మధ్య గణపతి పూజతో ప్రారంభించారు. ముందుగా మైదానానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులకు, వేమిరెడ్డి కోటారెడ్డి గారికి కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై గణపతి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు పాల్గొని పూజ నిర్వహించి ఆశీసులు అందుకున్నారు. అనంతరం స్పటిక లింగానికి మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం చేశారు. శ్రీ త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, అయోధ్య రామ మందిరం నమూనా ఆలయాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని వివరించారు. గత 8 ఏళ్లుగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షానికి ఇబ్బంది పడకుండా భారీ షెడ్లు నిర్మించామని వివరించారు. ఈ మూడు రోజులు దీపాలు వెలిగించి భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు. శుక్రవారం సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం, ఆకాశ దీపం, లక్ష దీపోత్సవ కార్యక్రమం, మహా శివునికి విశేష భస్మాభిషేకం, విశేష హారతులు ఉంటాయని వివరించారు.

శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మాట్లాడుతూ… మా వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవానికి వస్తున్న భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం జరుగుతుందన్నారుజ. ప్రతి సంవత్సరం విష్ణువు, శివుడికి సంబంధించి ఒక్కొక్క ఆలయ నమూనాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగ ఆలయ నమూనా, అయోధ్యలోని రామాలయం నమూనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు 20 అడుగుల ఎత్తున్న శివుడి విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు. కార్తీక మాసంలో వ్రతాలు, నోములతోపాటు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలందరికీ విష్ణువు, శివుడి ఆశీసులు అందాలన్న ఉద్దేశంతో ఈ లక్ష దీపోత్సవాన్ని ఇంత ఘనంగా చేపట్టామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులతో కలిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టామని, భక్తులకు నూనె, వత్తులు, సహా దీపాలు ఇక్కడే అందిస్తామని వివరించారు.