కిష్టయ్య బిడ్డ చదువుకు కేసీఆర్‌ ఆర్థికసాయం

ఎంబీబీఎస్‌ చదివించిన కేసీఆర్‌…
నేడు పీజీ కోర్సుకు కూడా చేయూత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమ రుడు కానిస్టేబుల్‌ కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్న కేసీఆర్‌ నాడు కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్‌ వైద్య విద్యకోసం అవసరమైన ఆర్థికసాయం అందించారు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతోంది. అందుకు మెడికల్‌ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకోసం కావలసిన రూ.24 లక్షల చెక్కును నేడు నందినగర్‌లో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్‌ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొడుకు రాహుల్‌ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్‌ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.