Mahanaadu-Logo-PNG-Large

కేసీఆర్… ముందుంది ముసళ్ల పండగ

మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలే
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
బీఆర్ఎస్ కు పుట్టగతులుండవ్ 
మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

మహబూబ్ నగర్, మహానాడు:  మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్… ముందుంది ముసళ్ల పండగ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…

మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చో.

నాలుగు రోజులుగా హరీష్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గాని వాళ్లకు నొప్పి తెలియలేదు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోంది. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ధైర్యం చేస్తుంది. ఎప్పుడు పార్టీ బలహీనపడితే, అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.

హరీష్, కేటీఆర్ కు సవాల్ విసురుతున్నా… పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయండి. పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండి. మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే… బిల్లా రంగాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగండి.  పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు..నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్ కు బీఆరెస్ కు పుట్టగతులు ఉండవనే కుట్రలు చేస్తున్నారు.

ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించాం. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాం.

నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యేనుగుల బలం వస్తుంది. ఈ ప్రభుత్వం మీది. మీ సూచనలు, సలహాలు ప్రభుత్వం పాటిస్తుంది. నాయకుల ఎన్నికలు ముగిశాయి. మీ కోసం కష్టపడే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.
ఇప్పటి వరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో నాయకులు మీ కోసం కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నాయకులకు ఆదేశించా.

పీసీసీ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకున్నా. నాకు అండగా నిలబడ్డ ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు అంటూ సీఎం రేవంత్ ప్రసంగాన్ని ముగించారు.