స్వలాభం కోసమే కేసీఆర్‌ ఆంధ్ర సెంటిమెంట్‌

-వాళ్లకు మీరు చేసిన పనులు గుర్తులేవా?
-అమరవీరుల చిహ్నాన్ని పెడితే నొప్పేంటి?
-టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కు మార్‌ గౌడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ సెంటిమెంట్‌ రాజేసి వాడుకుందని మండిపడ్డారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్‌ ను తమ స్వలాభం కోసం వాడుకుని అన్నింటినీ మరిపించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదేనని ధ్వజమెత్తారు. అమరవీరుల స్థూపాన్ని పెడితే మీకున్న కడుపు నొప్పి ఏంటి? అని ప్రశ్నించారు. వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది? మేం వెనక్కి తగ్గేది లేదు. కవులు కళాకారులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా ముందుకు వెళతామని తెలిపారు. 100 కోట్లు వెచ్చించి ఆ ఆకారంలో ఒక్క అమరవీరుడి పేరు అయిన చెక్కారా? ప్రజలు కోరుకున్న చిహ్నం అందరితో సంప్రదించి, అతి త్వరలో ప్రజల అకాంక్షలకు చిహ్నంగా తీసుకువస్తామని వెల్లడించారు.

అప్పుడు ఆంధ్ర సెంటిమెంట్‌ గుర్తురాలేదా?
2014 నుంచి మొన్నటి వరకు మీ ఘనతలు ప్రజల ముందు పెడతాం. చిన జీయర్‌ స్వామిని కూర్చోబెట్టినప్పుడు ఏ సెంటిమెంట్‌ గుర్తురాలేదా? అందెశ్రీ రాసిన గీతాన్ని ఆనాడు మీరు ఎవరితో పాడించారు? రామకృష్ణ అనే ఆంధ్ర వ్యక్తి తో పాడించలేదా? కళకు, కళాకారుడికి ప్రాంతాలు ఉండవు. కీరవాణి ఎంపిక ఆలోచన అందెశ్రీది. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిన ఆనందసాయి అనే వ్యక్తి ఆంధ్ర వాడు కాదా? రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి, పుల్లెల గోపిచంద్‌ను నియమించినప్పుడు గుర్తు రాలేదా? ఆంధ్ర బిర్యానీ అంటే పనికి రాదని అన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు గుర్తుకు రాలేదా? పనికి రాని ప్రాజెక్ట్‌ కట్టి ఆంధ్ర సీఎంను పిలిచినప్పుడు గుర్తుకు రాలేదా? కీరవాణి విషయంలో ఆస్కార్‌ గెలిచినప్పుడు మీరిద్దరూ కేసీఆర్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేయలేదా? శారద పీఠం భూములు తెలంగాణలో ఇచ్చినపుడు మీకు గుర్తుకు రాలేదా? అసలు తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీ నుండి తీసేశారు? అందుకే మిమ్మల్ని ప్రజలు తీసేశారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌ ఆలోచనలు కాదు…ప్రజల నుంచి వచ్చిన అకాంక్ష.చిహ్నాన్ని అందరితో చర్చించి ఏది మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారో దాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు.