యువకుడిపై కత్తితో దాడి

మరొకరికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం
పోలీసు ఔట్‌ పోస్టు వద్ద ఘటన

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్‌ పోస్టు వద్ద సోమవారం ఓ యువకుడు గంజాయి మత్తులో కత్తితో దాడి చేయగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా గంజాయి సేవించిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్‌ఖాన్‌గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్‌ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసు సిబ్బంది ఉండగానే దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు పాతకక్షలు కారణమని తెలుస్తోంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ కలుగజేసుకుని ఫిరోజ్‌ ఖాన్‌కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్‌ ఖాన్‌ను జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.