- వంద ఎకరాలను కలుషితం చేస్తున్న కృష్ణ ప్రభాస్ పేపర్ మిల్
- పేపర్ మిల్ నుంచి వెలువడిన అతి ప్రమాదకరమైన వ్యర్ధాలు
- పంట పొలంలో ప్రమాదకరమైన వ్యర్ధాలు
- నష్టపోయిన 100 ఎకరాల వరి పంట రైతులు
- తల్లడిల్లుతున్న పినపల్ల గ్రామ రైతాంగం
అది వందల ఎకరాల పంట భూమి. వరి పండిస్తున్న రైతులకు పేపర్‌మిల్లు కష్టంవచ్చిపడింది. ఆ మిల్లు వదిలే వ్యర్థాలన్నీ నేరుగా పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. ఫలితం.. ఒళ్లంతా కళ్లు చేసుకుని.. కాయకష్టం చేసి.. బోలెడు డబ్బు పెట్టుబడి పెట్టి పండించిన వరి.. కలుషితమవుతున్న విషాదం. ఇప్పుడు తమ జీవనాధారం నష్టపోతున్న ఆ రైతులకు న్యాయం చేసేదెవరు? సదరు పేపర్‌మిల్లుకు ముకుతాడేసేదెవరు? ఇదీ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పినపల్ల గ్రామంలో కృష్ణప్రభాస్ పేపర్‌మిల్లు బాధిత రైతాంగం వేదన.
( జానకీదేవి, తణుకు)
పినపల్ల: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం పినపల్ల గ్రామంలో కృష్ణ ప్రభాస్ పేపర్ మిల్లు నుంచి పారిశ్రామిక వ్యర్ధాలు గ్రామంలో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ ను కూడా కలుషితం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పేపర్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు రైతులు కోరుకుంటున్నారు.
గొడ్డు కాలువలో పారిశ్రామిక వ్యర్ధాలను కలిపేవారు. గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కాలువ పొంగి.. గ్రామ ప్రజల పంట కాలవల్లో ప్రవహించింది. పేపర్ మిల్లు నుంచి అతి ప్రమాదకరమైన యాసిడ్ వేస్ట్ గుజ్జు.. సుమారు 100 ఎకరాల పైచిలుకు వరి పంట పొలాలు కలుషితమైనవి.
100 ఎకరంలో ఉన్న ఈ వరి పంట నాశనం అయిపోయి, కొత్త వరి పంట వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు తక్షణ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని.. పినపాల గ్రామ రైతులు నష్టపరిహారం కల్పించాలని.. పరిశ్రమ వ్యర్ధాలు గ్రామంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.