కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

– బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె, “సభ్యసమాజం తలదించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయనకు మహిళలపై గౌరవం లేకపోవడం వారి సంస్కార హీనతను తెలియజేస్తుంది” అని ధ్వజమెత్తారు.

డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, “వరలక్ష్మీ వ్రతం రోజున సంతోషంగా పండుగ జరుపుకుంటున్న మహిళలను కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు క్షోభ కలిగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించే వారు పేద, మధ్యతరగతి మహిళలేనని, డబ్బు ఉన్న అహంకారంతో కేటీఆర్ వారిని అవమానిస్తున్నారని” విమర్శించారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ప్రజలకు తక్షణమే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేటీఆర్‌పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.

కేటీఆర్ తరచుగా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడు మరో రకంగా మాట్లాడటం అలవాటుగా మారిందని, ఆయన మాటల నుంచి పేద, మధ్యతరగతి మహిళలను కించపరచడం అసహ్యకరమని అన్నారు. బీజేపీ మహిళా మోర్చా పక్షాన తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు.